వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాలకు వలస వెళ్లిన భారతీయులు ఆయా దేశాల్లో కీలక స్థానాల్లో వున్న సంగతి తెలిసిందే.భారత సంతతి క్రమంగా పెరగడంతో అక్కడి వ్యవస్థలను శాసించే స్థాయికి చేరుకున్నారు .
ఉదాహరణకు అమెరికాను తీసుకుంటే ఈ గడ్డ మీదకు అడుగుపెట్టిన భారతీయులు క్రమంగా ఇక్కడి సమాజంలో కీలక స్థానాన్ని ఆక్రమించారు.అన్ని రంగాల్లో దూసుకెళ్తూ స్థానిక అమెరికన్లతో పాటు అగ్రరాజ్యంలో స్ధిరపడిన మిగిలిన విదేశీయులకు పోటీ ఇస్తున్నారు.
ఇక ఎన్నికల్లో భారతీయుల పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.పెన్సిల్వేనియా, జార్జియా, ఫ్లోరిడా, మిచిగాన్, టెక్సాస్, నార్త్ కరోలినా తదితర కీలక రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో స్థిరపడిన ఇండో అమెరికన్లు అభ్యర్ధుల విజయాలను శాసిస్తున్నారు.
అందుకే వీరి కరుణ కోసం రిపబ్లికన్లు, డెమొక్రాట్లు తెగ తపిస్తుంటారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికలు- 2020లో భారతీయుల హవా స్పష్టంగా కనిపించింది.
ఈ పరిస్ధితి ఒక్క అమెరికాలోనే కాదు.బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, దక్షిణాఫ్రికా ఇలా చాలా దేశాల్లో కింగ్ మేకర్లుగా ప్రవాసులు వున్నారు.
మరికొద్దిరోజుల్లో కెనడాలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భారతీయులు తమ స్టామినా ఏంటో చూపించేందుకు సిద్ధమవుతున్నారు.దీంతో ఇండో – కెనడియన్లను ప్రసన్నం చేసుకునేందుకు అక్కడి రాజకీయ పార్టీలు రకరకాలుగా ప్రయత్నిస్తున్నాయి.
ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది న్యూ డెమొక్రటిక్ పార్టీ (ఎన్‌డీపీ) నేత, భారత సంతతికి చెందిన జగ్మీత్ సింగ్ గురించే.కెనడా రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల వ్యక్తుల్లో జగ్మీత్ ఒకరు.
అతని నాయకత్వం, ప్రభావం, రాజకీయాలు ఒక్క భారతీయ సమాజానికే పరిమితం కాలేదు.ఇతనికి కెనడాలోనే జనాభా పరంగా అతిపెద్ద ప్రావిన్సులైన బ్రిటీష్ కొలంబియా, అంటారియోలలో గట్టి పట్టుంది.
మొత్తం కెనడా జనాభాలో భారతీయులు కేవలం 4 శాతం మంది మాత్రమే వున్నారు.అయితే వారి ఓట్లు మాత్రం కీలకమన్నది సుస్పష్టం.
అంటారియో, బ్రిటీష్ కొలంబియా, అల్బెర్టా, మానిటోబా వంటి ప్రావిన్సులలో భారతీయుల ప్రభావం వుంది.

ప్రస్తుత కెనడా రాజకీయ సరళిని పరిశీలిస్తే. కన్జర్వేటివ్స్, లిబరల్స్ మధ్య పోటీ నువ్వానేనా అన్నట్లుగా వుంటుందని సర్వేలు చెబుతున్నాయి.అయితే భారత రాజకీయాల మాదిరిగా.
కొన్ని చిన్న పార్టీలకు స్వల్పంగా సీట్లు వచ్చినా.అవి అధికార ఏర్పాటులో కీలకంగా మారిన సందర్భాలు కొకొల్లలు.
ప్రస్తుతం జస్టిన్ ట్రూడో మైనారిటీ ప్రభుత్వాన్ని నడుపుతున్న సంగతి తెలిసిందే.కెనడాలో రెండు ప్రధాన పార్టీలకు స్పష్టమైన మెజారిటీ రానీ పక్షంలో చిన్న పార్టీలు కీలక పాత్ర పోషించే అవకాశం వుంది.
ఈ విషయంలో జగ్మీత్ సింగ్ సారథ్యంలోని ఎన్‌డీపీకి ఎక్కువ ఛాన్స్ వుందని సర్వేలు చెబుతున్నాయి.సెప్టెంబర్ 20న కెనడాలో ఎన్నికలు జరగనున్నాయి.