2001 సెప్టెంబరు 11న అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ పైన బిన్ లాడెన్ నేతృత్వంలోని అల్‌ఖైదా ఉగ్రవాదులు జరిపిన దాడుల్ని చరిత్ర మరవలేదు.అత్యంత శక్తివంతమైన అమెరికాపై ఉగ్రదాడితో ప్రపంచ దేశాలన్నీ ఉలిక్కిపడ్డాయి.
సెప్టెంబరు 11 దాడుల్లో 3000 మంది బాధితులు, 19 మంది హైజాకర్లు మరణించారు.న్యూయార్క్ ప్రభుత్వారోగ్య శాఖ నివేదిక ప్రకారం, జూన్ 2019 నాటికి అగ్నిమాపక దళ సిబ్బంది మరియు పోలీసులు సహా రక్షణ చర్యల్లో పాల్గొన్న 836 మంది మరణించారు.
రెండు భవనాల్లో దుర్మరణం పాలైన మొత్తం బాధితుల్లో 343 మంది అగ్నిమాపక దళ సిబ్బంది, 60 మంది న్యూయార్క్ నగరం, పోర్ట్ అథారిటీలకు చెందిన పోలీసు అధికారులు ఉన్నారు.ఇంకా పెంటగాన్ భవనంపై జరిగిన దాడుల్లో 184 మంది దుర్మరణం చెందారు.
మరణించిన వారిలో అత్యధికులు సాధారణ పౌరులే.వారిలో 70కి పైగా ఇతర దేశాలకూ చెందిన వారున్నారు.
దీంతో బిన్‌లాడెన్, అల్‌ఖైదాలపై పగబట్టిన అమెరికా.ఆఫ్ఘన్ గడ్డపై దిగి భీకర దాడులు చేసింది.
పదేళ్ల పాటు నింగీ, నేల, పాతాళంలో గాలించి పాక్‌లోని అబోట్టాబాద్‌లో లాడెన్‌ను హతమార్చింది.
ఈ ఘటనకు సంబంధించి తాలిబన్లు, అల్‌ఖైదా తీవ్రవాదులను అమెరికా దర్యాప్తు సంస్థలు బాధ్యులుగా తేల్చాయి.
అయితే ఉగ్రవాదులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా, ఆర్థికంగా సహాయం చేసిన దేశాలు, వ్యక్తులు కొందరు వున్నారంటూ అనేక మంది ఆరోపణలు చేశారు.ముఖ్యంగా అమెరికాకు అత్యంత సన్నిహిత దేశమైన సౌదీ అరేబియా.
ఉగ్రవాదులకు అన్ని రకాలుగా సహకారం అందించిందనేది ఏళ్లుగా వినిపిస్తున్న ఆరోపణ.ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పటి వరకు 2001 సెప్టెంబర్ 11వ తేదీ (9/11) దాడులపై జరిపిన విచారణ పత్రాలు మొత్తం బహిర్గతం చేయాలని బైడెన్ ఎఫ్‌బీఐ , న్యాయశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఇందుకు సంబంధించి ఆయన ఆరు నెలల డెడ్ లైన్ విధించారు.
9/11 దాడుల వెనుక సౌదీ అరేబియా వుందన్న ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే బాధితుల కుటుంబాలు కొన్ని లక్షల కోట్ల డాలర్ల నష్టపరిహారం కోరుతూ సౌదీ ప్రభుత్వం మీద దావా వేసిన సంగతి తెలిసిందే.అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో తాను 9/11 దాడుల విషయంలో ప్రజలకు కొన్ని హామీలు ఇచ్చానని, ఇప్పుడు తాను అధ్యక్షుడిగా ఎన్నికైన నేపథ్యంలో ఆ హామీలను నెరవేర్చాలని భావిస్తున్నట్లు జో బైడెన్ తెలిపారు.
మరోవైపు అమెరికా కాంగ్రెస్ నియమించిన 9/11 కమీషన్.ఉగ్రదాడులకు సౌదీ అరేబియా ప్రభుత్వం కానీ, సంస్థలు కానీ, ఉన్నతాధికారులు కానీ నిధులు సమకూర్చినట్లుగా ఆధారాలు లేవని తెలిపింది.
అయితే సౌదీలోని అనధికార వర్గాలు లేని దిగువ ర్యాంకుకు చెందిన వారు మాత్రం దాడుల వెనుక కీలక పాత్ర పోషించే అవకాశాన్ని కొట్టిపారేయలేమని కమీషన్ వ్యాఖ్యానించింది.