తమిళనాడులోని నీలగిరి కనుమల్లో జరిగిన ఘోర హెలికాఫ్టర్ ప్రమాదంలో భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ ఆయన సతీమణి మధులికా రావత్ సహా 11 మంది సైనిక సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.ఈ దుర్ఘటనతో యావత్ దేశం శోకసంద్రంలో మునిగిపోయింది.
బుధవారం వెల్లింగ్టన్ డిఫెన్స్ స్టాఫ్ కాలేజీలో లెక్చర్ ఇచ్చేందుకు వెళ్తుండగా ఆయన బిపిన్ రావత్ దుర్మరణం పాలవ్వడం విచారకరం.ఈ ఘటనలో చిత్తూరు జిల్లాకు చెందిన లాన్స్ నాయక్ సాయితేజ కూడా ప్రాణాలు కోల్పోయారు.
దీంతో ఆయన కుటుంబం విషాదంలో కూరుకుపోయింది.ప్రస్తుతం వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్ స్టాఫ్ కాలేజీలో వున్న వీరి భౌతికకాయాలను న్యూఢిల్లీకి తరలించనున్నారు.
అక్కడ రాష్ట్రపతి, ప్రధాని వంటి ప్రముఖులు వారికి నివాళులర్పించనున్నారు.ఆ తర్వాత ఢిల్లీ నుంచి అమరవీరుల భౌతికకాయాలను వారి స్వస్థలాలకు చేర్చనున్నారు.

మరోవైపు బిపిన్ రావత్ మరణం పట్ల భారత సైన్యంతో పాటు పాకిస్తాన్ సహా పలుదేశాల సైన్యాధికారులు సంతాపం తెలిపారు.అలాగే రావత్ మృతికి అమెరికా రక్షణశాఖ నివాళి అర్పించింది.రావత్ కుటుంబసభ్యులతో పాటు ఆ ప్రమాదంలో చనిపోయిన సైనిక సిబ్బందికి యూఎస్ రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ సంతాపం తెలిపారు.ఇరు దేశాల రక్షణ సంబంధాల మధ్య రావత్ కీలక పాత్ర పోషించినట్లు ఆస్టిన్ పేర్కొన్నారు.

రావత్ మృతి పట్ల అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ జనరల్ మార్క్ మిల్లే కూడా సంతాపం తెలిపారు.భారతీయ సైన్యంపై రావత్ ప్రభావం ఎక్కుగా ఉంటుందన్నారు.అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ కూడా ఓ ప్రకటనలో రావత్‌కు నివాళులర్పించింది.అమెరికాలోని భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ దుర్మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు.
ఇటీవల కొలంబోలో, వాషింగ్టన్ డీసీలో సీడీసీ ఆయన సతీమణితో మాట్లాడినట్లు సంధు గుర్తుచేసుకున్నారు.ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రధాని మోడీ అమెరికా పర్యటన ముగిసిన కొన్ని రోజులకే జనరల్ బిపిన్ రావత్ అమెరికాకు వచ్చారు.
వాషింగ్టన్‌లో వున్న సమయంలో యూఎస్ ఆర్మీలోని కొందరు ఉన్నతాధికారులను ఆయన కలిశారు
.