ప్రస్తుతం కరోనా వైరస్ ధాటికి చైనా విలవిలలాడుతున్న సంగతి తెలిసిందే.దీని కారణంగా ఇప్పటి వరకు 25 మంది మరణించగా.850 మందిలో వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి.ఈ క్రమంలో అనేక దేశాలు వారి పౌరులను చైనా నుంచి వెనక్కి రప్పిస్తున్నాయి.
తాజాగా తమదేశ దౌత్యాధికారులు, పౌరులను తరలించడానికి అమెరికా ప్రభుత్వం చార్టర్ ఫ్లైట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న వుహాన్‌లోని యూఎస్ కాన్సులేట్ నుంచి మూడు డజన్ల మంది దౌత్యవేత్తలు, వారి కుటుంబసభ్యులను తరలించేందుకు ఫెడరల్ ప్రభుత్వం ఒక ట్రాన్స్పోర్ట్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.
ఇప్పటికే కాన్సులేట్‌ను మూసివేసినట్లుగా ఓ అత్యున్నత అధికారి తెలిపారు.ఫ్లైట్ షెడ్యూల్‌కు సంబంధించిన వివరాలు ఇంకా ఖరారు కాలేదన్నారు.
బోయింగ్ 737 లేదా బోయింగ్ 767 చార్టర్‌ను ఎంపిక చేస్తామని… దీని అనుమతికి చైనా ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉందన్నారు.అయితే ఈ విషయంపై స్టేట్ డిపార్ట్మెంట్, వైట్ హౌస్ ఇంకా స్పందించలేదు.
ఒకవేళ ఎవరికైనా వైరస్ సోకితే వారికి చికిత్స చేయడానికి విమానంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు.
వుహాన్‌లో సుమారు 1,000 మంది అమెరికన్లు నివసిస్తున్నారు.ఇప్పటికే దక్షిణ కొరియా, యునైటెడ్ కింగ్డమ్ వంటి ఇతర దేశాలు దౌత్యవేత్తలను వుహాన్ నుంచి తరలించడానికి సొంత రవాణాను ఏర్పాటు చేసుకుంటున్నాయి.