వృత్తి, విద్యా, వ్యాపారాల కోసం వివిధ దేశాలకు వలస వెళ్లిన భారతీయులు అక్కడ అనేక రంగాల్లో కీలక హోదాల్లో వున్న సంగతి తెలిసిందే.రాజకీయ, ఆర్ధిక, సామాజిక, న్యాయ రంగాల్లో అత్యున్నత పదవులను అలంకరిస్తున్నారు భారతీయులు.
తాజాగా ఆస్ట్రేలియాలో భారత సంతతి న్యాయకోవిదుడు కొత్త చరిత్ర సృష్టించారు.ఇండో ఆస్ట్రేలియన్ హమెంట్ ధన్జీ న్యూసౌత్ వేల్స్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
అటార్నీ జనరల్ మార్క్ స్పీక్మన్ మాట్లాడుతూ.ధన్జీ సుప్రీంకోర్ట్ బెంచ్‌కు మూడు దశాబ్ధాల న్యాయపరమైన అనుభవాన్ని తెచ్చిపెట్టారని కొనియాడారు.
ఈ నియామకం ద్వారా న్యూసౌత్ వేల్స్ రాష్ట్ర సుప్రీంకోర్ట్ న్యాయమూర్తిగా నియమితులైన తొలి భారత సంతతి వ్యక్తిగా ధన్జీ చరిత్ర సృష్టించారు.ఆయన 1990లో లీగల్ ప్రాక్టీషనర్‌గా చేరారు.
ఫోర్బ్స్ ఛాంబర్‌లో ప్రైవేట్ ప్రాక్టీస్‌లో బారిస్టర్‌గా ఆయన హైకోర్టులో అనేక ముఖ్యమైన కేసులను వాదించారు.క్రిమినల్ అప్పీల్ కోర్టులో దాదాపు 350 కేసులను టేకప్ చేశారు.
క్లిష్టమైన కార్పోరేట్ క్రైమ్ వ్యవహారాలతో పాటు క్రిమినల్ ట్రయల్స్‌లోనూ ధన్జీ పాలు పంచుకున్నారు.కామన్‌వెల్త్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ప్రాసిక్యూషణ్ తరపున కూడా ధన్జీ ప్రాసిక్యూషన్లు నిర్వహించారు.
పోలీస్ సమగ్రత కమీషన్, అవినీతికి వ్యతిరేకంగా న్యూసౌత్ వేల్స్ ఇండిపెండెంట్ కమీషన్ ముందు కౌన్సిలర్‌గా, న్యాయవాదిగా వాదనలు వినిపించారు.

మీడో బ్యాంక్ బాలుర ఉన్నత పాఠశాలలో హెచ్‌ఎస్‌సీ పూర్తి చేసిన హమెంట్ ధన్జీ.సిడ్నీ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ లా, బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ చేశారు.అనంతరం న్యూసౌత్‌వేల్స్‌లో లీగల్ ఎయిడ్ న్యాయవాదిగా తన వృత్తిని ప్రారంభించారు.
సెప్టెంబర్ 30న సుప్రీంకోర్ట్ న్యాయమూర్తిగా ధన్జీ బాధ్యతలు స్వీకరించనున్నారు.ఇంతకుముందు ఈ స్థానంలో జస్టిస్ రాబర్ట్ బీచ్ జోన్స్ న్యాయమూర్తిగా వ్యవహరించారు.