భారత ఐటీ రాజధాని బెంగళూరులోని ప్రఖ్యాత విద్యార్ధి భవన్‌కు గురువారం అనుకోని అతిథి వచ్చాడు.ఆయన ఎవరో కాదు.
స్టార్‌బక్స్ సహ వ్యవస్థాపకుడు Zev Siegl.ఈ సందర్భంగా రెస్టారెంట్‌లో భారతీయ రుచులైన మసాలా దోశ, ఫిల్టర్ కాఫీని టేస్ట్ చేశారు.
బెంగళూరులో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ 2022లో పాల్గొనేందుకు సీగల్ నగరానికి వచ్చారు.ఆయన 1971లో స్టార్‌బక్స్, కాఫీ హౌస్‌లను స్ధాపించారు.1980లో కంపెనీ నుంచి వైదొలిగే వరకు ఆ సంస్థకు వైస్ ప్రెసిడెంట్, డైరెక్టర్‌గా పనిచేశాడు.ప్రస్తుతం సీగల్ స్టార్టప్ కన్సల్టెంట్, బిజినెస్ అడ్వైజర్‌గా వ్యవహరిస్తున్నారు.
తనకు విద్యార్ధి భవన్‌లో మంచి ఆతిథ్యం లభించిందని.ఈ అద్భుతమైన అనుభూతితో సీటెల్ వెళ్తానని సీగల్ ట్వీట్ చేశారు.ఆయన విద్యార్ధి భవన్‌లో గడిపిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
1943- 44లో పాఠశాల విద్యార్ధుల కోసం సాధారణ క్యాంటీన్‌గా ప్రారంభించబడిన విద్యార్ధి భవన్. బెంగళూరులో ఐకానిక్ ప్లేస్‌గా మారిపోయింది.ముఖ్యంగా ఇక్కడ దొరికే మసాలా దోశకు జాతీయంగా, అంతర్జాతీయ గుర్తింపు లభించింది.రాజకీయ నాయకులు, సాహిత్య దిగ్గజాలు, విద్యార్ధులు, ఉద్యోగులకు ఇది నగరంలో హాట్ స్పాట్.ప్రస్తుత బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్ కూడా 2019లో తన భారత పర్యటనలో భాగంగా విద్యార్ధి భవన్‌ను సందర్శించారు.
ఇక సునాక్ భార్య అక్షతా మూర్తి బెంగళూరులోనే పుట్టి పెరిగిన సంగతి తెలిసిందే.ఆమె తల్లిదండ్రులు ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి, సుధా మూర్తిలు కూడా ఈ రెస్టారెంట్‌కు రెగ్యులర్ కస్టమర్‌లే.
ఇదిలావుండగా .ఈ ఏడాది జూలైలో ‘స్టార్ బక్స్’ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.భారతీయులను ఆకర్షించేందుకు గాను మసాలా చాయ్, ఫిల్టర్ కాఫీలను మెనూలో జోడిస్తున్నట్లు తెలిపింది.భారతీయ వినియోగదారులు తమ ఔట్ లెట్లను మరింత ఇష్టపడేలా చేసేందుకు గాను మెనూని మారుస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
చాయ్, ఫిల్టర్ కాఫీ కాకుండా, స్టార్ బక్స్ మెనూలో ఇప్పుడు అసెంబుల్డ్ శాండ్‌విచ్‌లు, మిల్క్ షేక్‌లు, బైట్ సైజ్ స్నాక్‌లను యాడ్ చేశారు.కొత్త మెనూని ప్రయోగాత్మకంగా భారతదేశంలోని బెంగళూరు, గుర్గావ్, భోపాల్, ఇండోర్ నగరాల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు.కొత్త వినియోగదారులను ఆకర్షించడం, ఇప్పటికే వున్న కస్టమర్లకు సరికొత్త అనుభూతిని అందించడం కోసం ప్రయత్నిస్తున్నట్లు సంస్థ అప్పట్లో తెలిపింది.