అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బరిలో నిలిచిన బిలియనీర్, ప్రముఖ వ్యాపారవేత్త మైఖేల్ బ్లూమ్‌బెర్గ్ ఎన్నికల ప్రచారానికి సంబంధించి అధికారిక ప్రతినిధిగా భారత సంతతి మహిళ సబ్రినా సింగ్ నియమితులయ్యారు.ఈమె గతంలో డెమొక్రాటిక్ నేషనల్ కమిటీ (డీఎన్‌సీ) ప్రతినిధిగా కూడా వ్యవహరించారు.
అంతకుముందు న్యూజెర్సీ సెనేటర్ కోరి బుకర్స్‌కు సైతం సహాయకురాలిగా పనిచేశారు.ఈ క్రమంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఓడించడానికి సబ్రినా కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించారని అమెరికన్ బజార్ తన కథనంలో తెలిపింది.
‘‘ తాను జాతీయ ప్రతినిధిగా మైఖేల్ బ్లూమ్ బెర్గ్ టీమ్‌లో చేరానని, ట్రంప్‌ను ఓడించడానికి పనిచేస్తున్న ఈ టీమ్‌తో కలిసి పనిచేయడానికి తాను ఎంతో సంతోషిస్తున్నానని సబ్రినా ట్వీట్ చేశారు.న్యూయార్క్ మాజీ మేయర్, బిలియనీర్ బ్లూమ్‌బెర్గ్ ఫోటోను ఆమె గతేడాది నవంబర్‌లో ఒక ప్రచార కార్యక్రమంలో ప్రచురించారు.
బ్లూమ్‌బర్గ్ ప్రచార దళం కూడా సబ్రినా సింగ్‌ను స్వాగతిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది.‘‘ సబ్రినాను ప్రచార బోర్డులో చేర్చడం తమకు ఎంతో ఆనందంగా ఉందని.
ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలని, సబినా అనుభవం తమకు ఉపయోగపడుతుందని’’ ప్రకటనలో తెలిపారు.
ఫిబ్రవరి 7న బ్లూమ్‌బెర్గ్ తన తదుపరి డెమొక్రాటిక్ డిబేట్‌ను కోల్పోతున్నారు.అయితే ఆయన ప్రచారం మార్చి 3న సూపర్ ట్యూజ్‌డే జరిగే డెమొక్రాటిక్ ప్రైమరీని లక్ష్యంగా చేసుకుంది.సబ్రినా సింగ్ 2016లో అమెరికా మాజీ విదేశాంగ కార్యదర్శి హిల్లరీ క్లింటన్ అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి రీజనల్ కమ్యూనికేషన్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు.
డెమొక్రాటిక్ పార్టీలో విభిన్న హోదాల్లో పనిచేసిన అనుభవం సబ్రినా సొంతం.డీఎన్‌సీ ఛైర్మన్ టామ్ పెరెజ్‌కి సహాయకురాలిగానే కాకుండా పార్టీలోని అనేక రాజకీయ కార్యక్రమాలను ఆమె పర్యవేక్షించారు.
సబ్రినా సింగ్ అమెరికన్ రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉన్న కుటుంబానికి చెందిన వారు.ఆమె తాత జేజే సింగ్ ఇండియా లీగ్ ఆఫ్ అమెరికాకు అధిపతి.1940లలో ఆయన భారతీయులతో కలిసి అమెరికాలో జాతి వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు.