తెలుగుదేశంపార్టీలో కూడా కాంగ్రెస్ పార్టీ తరహా ప్రజాస్వామ్యం బాగా పెరిగిపోయినట్లే ఉంది.విజయవాడ ఎంపి కేశినేని నాని రాజీనామా చేయాలని సొంత పార్టీ నేతలే తాజాగా డిమాండ్లు మొదలుపెట్టారు.
చాలా నియోజకవర్గాల్లో నేతల మధ్య సఖ్యత కొరవడింది.నేతల మధ్య ఆధిపత్య పోరాటాలు బాగా పెరిగిపోయాయి.
మిగితా ప్రాంతాల సంగతి ఎలాగున్నా విజయవాడలో మాత్రం నేతల మధ్య గొడవలు బాగా ముదిరిపోయి రోడ్డున పడ్డాయి.దాంతో చంద్రబాబునాయుడు కల్పించుకుని సర్దుబాటు చేశారు.
అయితే ఆ సర్దుబాటు మూణ్ణాల ముచ్చేటగానే ముగిసింది.
తాజాగా విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బోండా ఉమ, బుద్ధా వెంకన్న ఎంపి రాజీనామాకు డిమాండ్ చేయటం సంచలనంగా మారింది.
కేశినేని టీడీపీని కులసంఘంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాడా ? అంటూ ఘాటైన ఆరోపణలే చేశారు.మొన్నటి ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేయబట్టే నాని గెలిచారుని తేల్చేశారు.
అలా కాకుండా సొంత ఇమేజి మీదే గెలిచానని అనుకుంటే వెంటనే ఎంపిగా రాజీనామా చేయాలన్నారు.రాజీనామా చేసిన తర్వాత జరిగే ఉపఎన్నికల్లో దమ్ముంటే నాని స్వంతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి గెలవాలంటూ చాలెంజ్ చేయటం పార్టీలో కలకలం రేపుతోంది.
ఇండిపెండెంట్ అభ్యర్ధిగా పోటీ చేస్తే నాని సత్తా ఏమిటో తేలిపోతుందన్నారు.ఎంపి ఒంటెత్తు పోకడలను ఎంతమాత్రం సహించేది లేదని ఏకంగా వార్నింగే ఇచ్చేశారు.నాని పాల్గొనే ఏ కార్యక్రమంలో చివరకు చంద్రబాబు వచ్చినా తాము పాల్గొనేది లేదని అల్టిమేటమ్ ఇచ్చేశారు.మరి వీళ్ళిచ్చిన అల్టిమేటమ్ ఎంపికా లేకపోతే చంద్రబాబుకా అన్నదే అర్ధం కావటంలేదు.
అసలు చంద్రబాబును ఏకవచనంతో సంభోదించినందుకు గతంలోనే ఎంపిని ఏ విధంగా సత్కరించాలని అనుకున్నారో కూడా వెంకన్న చెప్పటం కలకలం రేపింది.

మొత్తానికి విజయవాడ టీడీపీ నేతల మధ్య కుంపట్లు బాగానే మండుతోంది.ఎంపికి వ్యతిరేకంగా బోండా, బుద్ధా, నాగూల్ మీరా ఏకమయ్యారు.వీళ్ళకు తెరవెనుక నుండి మరికొందరు కీలక నేతలు మద్దతుగా నిలబడ్డారని ప్రచారం జరుగుతోంది.
దీంతో క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలను చూసిన తర్వాత ఎంపి ఒంటరైపోయిన విషయం అర్ధమైపోతోంది.విజయవాడ మేయర్ అభ్యర్ధిగా తన కూతురు శ్వేతను చంద్రబాబుతో ఎంపి ప్రకటింపచేసుకోవటాన్ని ప్రత్యర్ధులు తట్టుకోలేకపోతున్నట్లున్నారు.
మరి తన రాజీనామాకు పార్టీలోని నేతలే బహిరంగంగా డిమాండ్ చేయటంపై ఎంపి ఎలా స్పందిస్తారో చూడాలి.రాజీనామాకు డిమాండ్ చేయటం ఒక ఎత్తైతే తాను పాల్గొన్న కార్యక్రమాలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించటం మరోఎత్తు.
నిజంగా తాజా పరిణామాలు ఎంపికి అవమానమనే చెప్పాలి.మామూలుగానే ఎంపి ఆవేశపరుడు.
ఇపుడు సొంతపార్టీ నేతల నుండే తన రాజీనామాకు మొదలైన డిమాండ్లను సీరియస్ గా తీసుకుంటే పార్టీకి కష్టమనే చెప్పాలి.చూద్దాం కేశినేని నాని ఏమంటారో .