ఐదారేళ్ల క్రితం అమెరికా దౌత్యవేత్తలను వణికించిన ‘‘ హవానా సిండ్రోమ్ ’’ మరోసారి అగ్రరాజ్యంలో తెరపైకి వచ్చింది.అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా దూసుకెళ్తున్న అమెరికాకు ఆ సిండ్రోమ్ ఎందుకు వస్తోందో అంతుపట్టడంలేదు.
ఎవరో కావాలని తమపై కుట్ర పన్నుతున్నారన్న అనుమానం కూడా అమెరికాలో ఉంది.తాజాగా వెలుగు చూసిన హవానా సిండ్రోమ్ వల్ల అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ వియత్నాం పర్యటన కొన్ని గంటలపాటు ఆలస్యమైంది.
వియత్నాంలోని అమెరికా దౌత్య సిబ్బందిలో ఒకరు హవానా సిండ్రోమ్ వంటి సమస్య బారిన పడినట్లు తేలింది.ఈ సారి దౌత్య సిబ్బంది నివాసం వద్ద ఈ పరిస్థితి తలెత్తింది.
గతంలో ఇక్కడి సిబ్బంది ఇదే సమస్యతో ఇబ్బంది పడ్డారు.దీంతో ఒక్కసారిగా అప్రమత్తమైన అమెరికా.
కమలా హారీస్ పర్యటన సందర్భంగా భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది.
హవానా సిండ్రోమ్ అంటే:
2016లో క్యూబాలోని హవానా నగరంలో వున్న అమెరికా దౌత్యకారాలయ సిబ్బందిలో ఈ సిండ్రోమ్‌ను గుర్తించారు.మెదడుపై ఏదో తెలియని తీవ్రమైన ఒత్తిడి కలగడం.కందిరీగల దండు చెవి వద్ద తిరుగుతున్నట్లుగా చప్పుడు వినిపిస్తుంటుంది.ఈ శబ్దం భరించలేని స్థాయిలో ఉంటుంది.దీని ప్రభావానికి గురైన వ్యక్తికి తొలుత వికారం కలుగుతుంది.
విపరీతమైన అలసటతో పాటు.ఏ విషయాన్ని గుర్తుపెట్టుకోలేరు.
క్యూబాలో ఈ ప్రభావానికి లోనైన వారిలో చాలామందికి వినికిడి శక్తి దెబ్బతింది.అనంతరం వారి మెదడును స్కాన్ చేసిన డాక్టర్లకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి.
ఈ సిండ్రోమ్ బారిన పడిన వారి మెదడు దెబ్బతిన్నట్లు వైద్యులు గుర్తించారు.
అయితే అమెరికా ప్రభుత్వ శాఖల్లోని కొన్ని రకాల ఉద్యోగులు మాత్రమే ఈ హవానా సిండ్రోమ్ బారిన పడుతున్నారు.
క్యూబా, చైనా దౌత్యకార్యాలయాల్లో పనిచేసే వారే ఎక్కువ బాధితులుగా వుండటం గమనార్హం.దౌత్యవేత్తలు, గూఢచారులు, సైనిక సిబ్బంది, సీఐఏ సిబ్బంది, విదేశాగ శాఖ సిబ్బంది ఈ జాబితాలో ఉన్నారు.
ఈ సిండ్రోమ్ వెలుగు చూసిన ఈ ఐదేళ్ల కాలంలో దాదాపు 200 మంది దీని బారిన పడి ఉంటారని అంచనా.మైక్రోవేవ్ తరంగాలను ఆసరాగా చేసుకుని కొందరు దాడులు చేయడం వల్లే తమ సిబ్బంది బాధితులుగా మారుతున్నారని అమెరికా అనుమానిస్తోంది.

దీనికి బలం చేకూర్చేలా 2019లో కారులో ప్రయాణిస్తున్న ఒక అమెరికా సైనిక అధికారికి ఒక్కసారిగా వికారంగా అనిపించింది.అదే సమయంలో వెనుకసీటులో ఉన్న అతడి రెండేళ్ల కుమారుడు కూడా గుక్కతిప్పుకొని విధంగా ఏడవటం మొదలు పెట్టాడు.అయితే వారు కారు దిగిన కొద్దిసేపటి తర్వాత ఇద్దరిలో ఆ లక్షణాలు తగ్గడం అనేక అనుమానాలకు తావిచ్చింది.మైక్రోవేవ్ తరంగాల వల్లే ఈ సమస్య ఎదురవుతున్నట్లుగా అమెరికా పరిశోధనలో తేలింది.
కాగా, ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా బలగాలు వైదొలగడంతో తాలిబన్లు రెచ్చిపోయిన సంగతి తెలిసిందే.అత్యంత సులభంగా, ఏ మాత్రం ప్రతిఘటన లేకుండా ఆఫ్ఘనిస్తాన్‌ను వారు హస్తగతం చేసుకున్నారు.
ప్రస్తుతం అక్కడ ఎలాంటి పరిస్ధితులు వున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.దీంతో అన్ని వైపుల నుంచి అమెరికాపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పలు దేశాల్లో అగ్రరాజ్యం పరపతి పడిపోయినట్లుగా సర్వేలు చెబుతున్నాయి.ఈ నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారీస్ రంగంలోకి దిగారు.
ఈ రోజు నుంచి ఆమె ఆసియా దేశాల్లో పర్యటించనున్నారు.దీనిలో భాగంగా సింగపూర్, వియత్నాంలలో కమలా హారీస్ పర్యటన సాగనుంది
.