దాదాపు ఎనిమిదేళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసు దోషులను ఈ నెల 20న ఉరి తీయాలని కోర్టు డెత్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే.దోషులు ఇప్పటికే న్యాయపరమైన అన్ని అవకాశాలను వినియోగించుకున్నారు.
కోర్టు డెత్ వారెంట్ జారీ చేసిన తరువాత నిందితులు పిటిషన్లు వేసినా కోర్టు వాటిని తోసిపుచ్చింది.
తాజాగా దోషులలో ఒకడైన అక్షయ్ కుమార్ భార్య పునీత విడాకులు కావాలని కోర్టును ఆశ్రయించింది.
పిటిషన్ లో పునీత రేప్ కేసులో ఉరి తీసిన దోషి భార్యగా తాను ఉండదలచుకోలేదని అందుకే తనకు విడాకులు కావాలని పేర్కొన్నారు.ఔరంగాబాద్ ఫ్యామిలీ కోర్టులో మంగళవారం రోజున ఆమె ఈ పిటిషన్ ను దాఖలు చేశారు.
మార్చి 19న కోర్టు ఈ పిటిషన్ ను విచారించనుంది.నేరం జరిగిన చాలా సంవత్సరాల తర్వాత పునీత పిటిషన్ వేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కోర్టు ఈ కేసులో అక్షయ్ కుమార్ కు నోటీసులు జారీ చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.ఈ కేసులో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాలంటే మాత్రం మార్చి 19 వరకు ఆగాల్సిందే.2012 సంవత్సరం డిసెంబర్ నెలలో కదులుతున్న బస్సులో నిర్భయపై ఆరుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు.యువతి సింగపూర్ లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
ఈ కేసులో ప్రధాన నిందితుడు రామ్ సింగ్ జైలులో ఆత్మహత్య చేసుకోగా మరో నిందితుడు మైనర్ కావడంతో మూడేళ్ల జైలు శిక్ష అనంతరం విడుదలయ్యాడు.