అమెరికాలో ఒక విద్యార్థిని కాపాడేందుకు ఒక మహిళా పోలీస్ అధికారిణి తన ప్రాణాలను సైతం పణంగా పెట్టింది.ఆమె చేసిన ఈ పనిని ఇప్పుడు అందరూ తెగ పొగిడేస్తున్నారు.
హీరోలు ఎక్కడో ఉండరు, ఇలా పోలీసుల రూపంలోనే ఉంటారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.ఈ పోలీస్ అధికారిణి ఒక స్కూల్ చిన్నారిని కాపాడిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది.
వివరాల్లోకి వెళితే… మేరీల్యాండ్‌లోని నార్త్ ఈస్ట్‌లోని మిడిల్ స్కూల్ వద్ద విద్యార్థిని, విద్యార్థులను రోడ్డు దాటించే డ్యూటీ చేస్తోంది ఓ పోలీస్ ఆఫీసర్.ఈ క్రమంలోనే శుక్రవారం ఒక గర్ల్ స్టూడెంట్ ని క్రాస్ వాక్ ద్వారా రోడ్డు దాటమని ఆమె సలహా ఇచ్చింది.
ఆ స్టూడెంట్ రోడ్డు దాటుతుండగా మరో వైపు నుంచి వేగంగా ఒక కారు దూసుకొచ్చింది.వెంటనే అప్రమత్తమైన ఆ పోలీస్ అధికారిణి చిన్నారి కారు కింద పడకుండా పక్కకు నెట్టేసింది.దీంతో స్టూడెంట్ కి ఎలాంటి గాయాలు కాలేదు.ఈ దృశ్యాన్ని చూసిన నెటిజన్లు మేరీల్యాండ్ పోలీసు అధికారిణిని హీరోగా పేర్కొంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
కార్పోరల్ అన్నెట్ గుడ్‌ఇయర్ అనే లేడీ పోలీస్ ఆఫీసర్ మిడిల్ స్కూల్ వెలుపల క్రాస్‌వాక్ వద్ద డ్యూటీ చేస్తున్నారని జిల్లా అధికారులు తెలిపారు.ఒక విద్యార్థి వీధి దాటుతుండగా ఎదురుగా వస్తున్న కారు ఆగలేదని… అందుకే ఈ ప్రమాదం చోటు చేసుకుందని వెల్లడించారు.
సమీపంలోని పాఠశాల బస్సులో నుంచి ఈ వీడియో రికార్డయింది.
ఇందులో పిల్లవాడిని దాటడానికి కొన్ని క్షణాల ముందు గుడ్‌ఇయర్ డ్రైవర్‌ను కారు ఆపమని సిగ్నల్ ఇవ్వడం కనిపించింది.కానీ కారు ఆగడం లేదని గుడ్‌ఇయర్ గ్రహించినప్పుడు, ఆమె విద్యార్థిని ప్రమాదం నుంచి బయటకు నెట్టివేసింది.ఈ క్రమంలో కారు ఆమెను ఢీకొట్టింది.
దీంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి.పాఠశాల జిల్లా సూపరింటెండెంట్ డాక్టర్ జెఫ్రీ లాసన్, ఒక ట్వీట్‌లో ఈ పోలీస్ ఆఫీసర్ ని ప్రశంసించారు.
“హీరో పోలీసు అధికారులు చేసేది ఇలాంటి గొప్ప పనులే!” అని సూపరింటెండెంట్ డాక్టర్ జెఫ్రీ ట్వీట్ చేశారు.
“ఈరోజు నార్త్ ఈస్ట్ పోలీస్ డిపార్ట్‌మెంట్ అధికారి అన్నెట్ గుడ్‌ఇయర్ వీరోచిత చర్యలు గుర్తించడానికి మేం కొంత సమయం కేటాయించాలనుకుంటున్నాం” అని సెసిల్ కౌంటీ పబ్లిక్ స్కూల్ ఫేస్‌బుక్ పోస్ట్‌లో తెలిపింది.అలాగే జిల్లా కార్పోరల్ గుడ్‌ఇయర్ కు అండగా నిలిచింది.గాయాలైన ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లి అక్కడ ఆమెకు చికిత్స చేయించారు జిల్లా కార్పోరల్ అధికారులు.
ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.