దిశ హత్యాచారం కేసులో నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేయగానే దేశమంతా వాళ్లను ఆకాశానికెత్తింది.పోలీసులు సరైన న్యాయం చేశారని కీర్తించింది.
అయితే ఈ కేసులో నిందితులు పేదవాళ్లు కాబట్టి పోలీసులు ధైర్యం చేయగలిగారని, అదే పెద్ద వాళ్లు ఉండి ఉంటే ఇలా చేసేవారా అన్న విమర్శలూ ఈ ఎన్‌కౌంటర్‌పై ఉన్నాయి.

ఇప్పుడా విమర్శలు నిజమే అన్నట్లుగా పోలీసుల తీరు ఉంది.ఆ మధ్య బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై జరిగిన కారు ప్రమాదం సంగతి తెలుసు కదా.ఫ్లై ఓవర్ నుంచి కారు కిందపడిన ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.మరికొందరికి గాయాలయ్యాయి.ప్రమాదానికి కారణమైన కల్వకుంట్ల కృష్ణమిలన్ రావు మాత్రం స్వల్పగాయాలతో బయటపడ్డాడు.
అంతేకాదు ఇప్పటి వరకూ అరెస్ట్ కాకుండా ఉండటం గమనార్హం.ఆ ఫ్లై ఓవర్‌పై గంటకు గరిష్ఠంగా 40 కిలోమీటర్ల వేగంతోనే ప్రయాణించాలని, కృష్ణమిలన్ రావు మాత్రం 104 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడానికి పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.
కానీ ఇన్నాళ్లూ అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడంటూ అరెస్ట్ చేయలేదు.

ఆ తర్వాత అతన్ని ఈ నెల 12 వరకూ అరెస్ట్ చేయొద్దంటూ కోర్టు చెప్పింది.దీంతో కృష్ణమిలన్ రావు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిపోయి హాయిగా ఇంటికెళ్లిపోయారు.అతడో కంపెనీకి సీఈవో.
పలుకుబడి ఉన్న వ్యక్తి.దీంతో అతన్ని అరెస్ట్ చేయడానికి, అతనికి వ్యతిరేకంగా గట్టిగా వాదించడానికి పోలీసులు వెనుకాడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అతని తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నా.బెయిల్ పొందగలిగే 304, 304 (ఎ) కేసులు పెట్టడం చూస్తుంటేనే మనకు పరిస్థితి అర్థమవుతోంది.