తాను ఏం మాట్లాడాలి అనుకుంటున్నాడో మొహమాటం లేకుండా మాట్లాడుతూ సొంత పార్టీ, ప్రత్యర్థి పార్టీ అని తేడా లేకుండా అందరిని తిట్టి పోస్తూ ఉండే అనంతపురం జిల్లా సీనియర్ నాయకుడు మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కొంతకాలంగా రాజకీయ వైరాగ్యం తో ఉన్నారు.ఎంపీగా తెలుగుదేశం పార్టీ నుంచి ఓటమి చెందినప్పటి నుంచి ఆయన పార్టీ మారాలని చూస్తున్నారు.

దానిలో భాగంగానే జగన్ మావాడు, మొండి వాడైనా మంచివాడు అంటూ పొగడ్తల వర్షం కురిపించారు.దీంతో జేసి వైసీపీలో చేరుతున్నారని అంతా భావించారు.కానీ జగన్ వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు.అయితే మెల్లిమెల్లిగా వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు కురిపిస్తూ ఉండడం మొదలు పెట్టారు.

వెంటనే ఆయనకు చెందిన దివాకర్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారులు దాడులు చేయడం, బస్సులు సీజ్ చేయడం, ఇతర ఆస్తుల పైన అధికారులు దాడులు నిర్వహించడం ఇవన్నీ చోటు చేసుకున్నాయి.దీంతో జేసీ పై తాజాగా పోలీసులు కేసు పెట్టి పోలీస్టేషన్ కు తీసుకెళ్లి ఎనిమిది గంటలపాటు స్టేషన్లోనే కూర్చోబెట్టారు.ఆయన స్టేషన్ బెయిల్ తీసుకెళ్లినా ఆయన్ను కావాలని వెయిటింగ్ లో పెట్టారు.దీంతో బయటికి వచ్చిన జేసీ మరోసారి జగన్ పై విమర్శలు చేశారు.జగన్ ప్రభుత్వాన్ని కేంద్రం బర్తరఫ్ చేయాలంటూ డిమాండ్ చేశారు.ఇక జగన్ ప్రభుత్వం నుంచి తనకు నిత్యం వేధింపులు తప్పవు అనే ఒక అభిప్రాయానికి వచ్చారు జేసీ.

కేంద్ర అధికార పార్టీ బీజేపీ లో చేరితే తప్ప రక్షణ ఉండదు అనే అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం.దీనిలో భాగంగానే బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ ను ఆయన కలిశారు.ఈ సందర్భంగా జాతీయ పార్టీలతోనే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని, జమిలి ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల ప్రభావం పోవాలంటూ ప్రకటించి సంచలనం సృష్టించారు.దీంతో జేసీ అతి తొందర్లోనే బిజెపిలో చేరి పోతున్నారనే ప్రచారానికి మరింత బలం చేకూరింది.