రోడ్డుపై చిన్న నోటు పడితే చాలు.చాలా మంది గుట్టు చప్పుడు కాకుండా తీసుకుని జేబులో పెట్టుకుంటారు.
ఇక దొంగల సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.తమ చేతికి దొరికినంత పట్టుకుపోతారు.
చాలా ఇళ్లలో రాత్రి వేళ, పగటి వేళ తేడా లేకుండా తమ హస్తలాఘవం ప్రదర్శిస్తారు.అయితే కళ్ల ముందే భారీగా బంగారం, వెండి, వజ్రాలు ఉంటే తీసుకోని వారెవరైనా ఉంటారా? అయితే ఓ చోట మాత్రం అక్కడ భారీగా నిధి ఉన్నా ఎవరూ ముట్టుకునే సాహసం చేయడం లేదు.చాలా ఏళ్లుగా అక్కడ ఉన్న నిధిని తీసుకునేందుకు కనీసం దొంగలు కూడా ప్రయత్నించరు.ఈ ఆసక్తికర అంశానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
హిమాచల్ ప్రదేశ్ మండీలోయ ప్రాంతం ఎంతో సుందరంగా ఉంటుంది.కనుచూపు మేర కొండలు, పచ్చని తివాచీ పరుచుకున్నట్లు కనిపించే లోయలు, సరస్సులు ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తాయి.
అక్కడ కమ్రునాగ్ అనే సరస్సు ఉంది.దానికి దగ్గరంలోనే ఓ దేవాలయం కూడా ఉంది.
చాలా ఏళ్లుగా ఆ దేవాలయానికి వచ్చే భక్తులు తమ మొక్కులు తీర్చుకుంటున్నారు.ఆ తర్వాత అక్కడి సరస్సులో బంగారం, వెండి, వజ్రాభరణాలను వేసేస్తారు.
ఇలా మొక్కులు పూర్తి చేసుకుని భక్తిభావంతో ఇంటికి వెళతారు.చాలా ఏళ్లుగా ఆ సరస్సులో భక్తులు మొక్కుల రూపంలో వేసిన బంగారం నిధి పెద్ద మొత్తంలో ఉందని తెలుస్తోంది.
అంత పెద్ద నిధి ఉన్నా అక్కడ ఎవరూ దొంగతనం చేసే సాహసం చేయరు.ఆ నిధి నేరుగా పాతాళానికి దారి తీస్తుందని స్థానికుల విశ్వాసం.
అంతేకాకుండా అందులోని నిధి దేవతలకు చెందినదిగా అక్కడి వారు భావిస్తారు.వాటిని ముట్టుకుంటే శాపం కలుగుతుందని, ఎవరైనా దొంగతనం చేయాలనుకుంటే నిధికి కాపలా ఉండే భారీ పాముకు బలవ్వాల్సిందేనని విశ్వసిస్తారు.
దీంతో చాలా ఏళ్లుగా ఆ సరస్సులో భారీ నిధిని గజ దొంగలు కూడా మాయం చేసే ఆలోచన చేయడం లేదు.ఫలితంగా ఎంతో నిధి ఉన్న సరస్సుగా కమ్రునాగ్ కీర్తి గడిస్తోంది.