మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లుగా వుంది బ్రిటన్ పరిస్ధితి.ఇప్పటికే కరోనాతో సతమతమవుతున్న ఇంగ్లీష్ గడ్డ.
తాజాగా ఆహార సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది.గడిచిన కొన్నినెలలుగా బ్రిటన్‌లోని సూపర్ మార్కెట్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
దాంతో తిండిగింజల కోసం యూకే వాసులు చాలా ఇబ్బంది పడుతున్నారు.కరోనా మహమ్మారి సంక్షోభంతో బ్రిటన్‌లో ఆహారం, ఇంధన సరఫరా, రవాణా సమస్య కూడా తలెత్తడం ప్రారంభమైంది.
వైరస్, లాక్‌డౌన్ కారణంగా సరైన సంఖ్యలో సిబ్బంది లేకపోవడం వల్ల నిత్యవసర వస్తువులు క్రమంగా మార్కెట్ నుంచి కనుమరుగవడం మొదలైంది.ఫలితంగా సూపర్‌మార్కెట్లు ఖాళీగా కనిపిస్తున్నాయి.
దీనికంతటికి కారణం బ్రెగ్జిట్ (యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడం).ఇది గతేడాది జనవరి నుంచి అమల్లోకి వచ్చింది.దీంతో యూకేలో కొత్త ఇమ్మిగ్రేషన్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి.ఫలితంగా ఇతర ఈయూ దేశాల కార్మికులు బ్రిటన్‌లో నివసించడానికి, వీసా లేకుండా పని చేయడానికి గతంలో ఇచ్చిన అనుమతులు రద్దయ్యాయి.
అరెస్ట్‌ల భయంతో గత ఏడాది నుంచి యూకే నుంచి పలు దేశాల కార్మికులు వారి స్వస్థలాలకు వెళ్లిపోతున్నారు.
బ్రెగ్జిట్ తరువాత కార్మికుల కొరతను అంచనా వేయడంలో విఫలమైనందుకు బోరిస్ జాన్సన్ ప్రభుత్వంపై ప్రతిపక్ష లేబర్ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నిప్పులు చెరిగారు.
ఇది వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమతో సహా దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తోందని మండిపడ్డారు.అయితే వైరస్ కారణంగానే ట్రక్ డ్రైవర్ల కొరత, ఇంధన కొరత ఏర్పడిందని ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమర్ధించుకుంటోంది.
ఇది తాత్కాలిక సమస్యేనని త్వరలోనే పరిస్ధితులు చక్కబడతాయని చెబుతోంది.

అయితే యూకేలో పరిస్ధితి అందుకు భిన్నంగా వుంది.సరిపడా డ్రైవర్లు లేక గూడ్స్ రవాణా రంగం అతలాకుతలమైపోతోంది.దేశంలో హెవీ గూడ్స్ వెహికిల్స్ నడిపే డ్రైవర్లు లేక రవాణా రంగంపై ఆధారపడి నడుస్తున్న పరిశ్రమలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
పెట్రోల్బంకులకు ఇంధనాన్ని తరలించే వాహనాలకు కూడా డ్రైవర్లు లేకపోవడంతో బంకులు మూతపడుతున్నాయి.అంబులెన్స్ల వంటి అత్యవసర వాహనాలు సైతం ఫ్యూయల్ కోసం బంకులు వెతుక్కుంటూ తిరగాల్సి వస్తోంది.
చాలా చోట్ల ఇంధనం లేక ఫ్యూయెల్ స్టేషన్ల ముందు నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.వున్న కొద్దిపాటి ఫ్యూయెల్ కోసం భారీగా వాహానాలు బారులు తీరుతున్నాయి.ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు బ్రిటిష్ ప్రభుత్వం ట్రక్కు డ్రైవర్ల కోసం ప్రత్యేకంగా 5,000 తాత్కాలిక వీసాలను జారీ చేయాలని నిర్ణయించింది.బ్రెగ్జిట్ లక్ష్యాలకు విరుద్ధంగా.
అయిష్టంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.