అగ్రరాజ్యం అమెరికాలో తుపాకీ గర్జన కొనసాగుతూనే ఉన్నది.తాజాగా సెంట్రల్ ఫ్లోరిడాలోని లేక్ ల్యాండ్‌లో ఆదివారం తెల్లవారుజామున ఓ ఉన్మాది తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డాడు.
ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.మృతుల్లో ఓ బాలింత, ఆమె ఒడిలోని శిశువు కూడా ఉన్నారు.
బుల్లెట్ ప్రూఫ్ దుస్తులు ధరించిన వ్యక్తి ఆదివారం ఉదయం లేల్యాండ్‌లోని ఓ ఇంట్లోకి చొరబడి కనిపించినవారిపై తూటాల వర్షం కురింపించాడు.దీంతో 11 ఏండ్ల బాలిక, బాలింత, ఆమె ఒడిలోని శిశువు, మరో మహిళ మృతిచెందారని పోలీసులు తెలిపారు.
కాల్పులకు పాల్పడిన ఆగంతుకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు .నిందితుడిని బ్రయాన్ రిలేగా గుర్తించారు.అతడు గతంలో యూఎస్ మెరైన్‌లో పనిచేశాడని, మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని తెలిపారు.బ్రయాన్ ఇరాక్, ఆఫ్ఘనిస్థాన్‌లో జరిగిన యుద్ధాల్లో పాల్గొన్నాడని, ప్రస్తుతం బాడీగార్డుగా, సెక్యూరిటి గార్డుగా పనిచేస్తున్నాడని పోలీసులు చెప్పారు.
కాగా, శనివారం రాత్రి వాషింగ్టన్‌లో జరిగిన మరో కాల్పుల ఘటనలో ముగ్గురు మరణించగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.వాయువ్య వాషింగ్టన్‌లోని ఒక వీధిలో ఓ వ్యక్తి కారులోంచి ఒక గుంపుపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.
ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా.ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
క్షతగాత్రులను పోలీసులు ఆసుపత్రికి తరలించారు.మరణించిన వారంతా యువకులేనని మెట్రోపాలిటిన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ చీఫ్ రాబర్ట్ కాంటీ మీడియాకు తెలిపారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే వుందని కాంటీ చెప్పారు.ఈ దాడిలో నిందితుడు ఉపయోగించిన వాహనం తాలూకు ఛాయాచిత్రాలను దగ్గరలోని సీసీ కెమెరా నుంచి సేకరించినట్లు కాంటీ తెలిపారు.
సదరు వాహనంలో ఎంతమంది అనుమానితులు వున్నారని.ఒక్కరు కాకుండా ఇద్దరు, ముగ్గురు కలిసి ప్రజలపై కాల్పులు జరిపారని ఆయన వెల్లడించారు.అయితే వాహనంలో వున్న వారికి బాధితులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు కాంటీ చెప్పారు.ఘటనాస్థలిలో తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఈ ఘటనకు సంబంధించి ఏదైనా సమాచారం తెలిస్తే .ధైర్యంగా ముందుకు వచ్చి తమకు సహకరించాల్సిందిగా కాంటీ కోరారు.గన్ కల్చర్‌పై ఆయన మాట్లాడుతూ.ఇది ఒక్క వాషింగ్టన్‌కు మాత్రమే పరిమితం కాలేదన్నారు.అమెరికన్ సమాజం మొత్తం తుపాకీ హింసకు గురైందని కాంటీ ఆవేదన వ్యక్తం చేశారు.