అమెరికాలాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ముందుగా తమ ప్రజలకు ఒక విషయం గురించి పదే పదే చెబుతుంటారు.ఏ ఆపద వచ్చినా వెంటనే 911 నంబర్‌కు కాల్ చేయండి అని.
అదే ఇండియాలాంటి దేశాల్లో మాత్రం ఇలాంటి ఎమర్జెన్సీ నంబర్లను ఇప్పటికీ ఎవరూ పెద్దగా ఉపయోగించుకోవడం లేదు.ప్రియాంకా రెడ్డి హత్యతో ఇది మరోసారి నిరూపితమైంది.
బాగా చదువుకున్న అమ్మాయి.పైగా డాక్టర్.అలాంటి వ్యక్తికి కూడా ఆ ఎమర్జెన్సీ సమయంలో పోలీసులకు ఫోన్ చేయాలన్న ఆలోచన రాలేదు.అలాంటి పరిస్థితుల్లో సహజంగానే ఉండే భయం కావచ్చు.ఆందోళన కావచ్చు.ఆమెకు ఈ విషయం గుర్తుకు వచ్చి ఉండకపోవచ్చు.కానీ భవిష్యత్తులో మరో అబలకు ఇలాంటి పరిస్థితి ఎదురు కాకుండా ఉండాలంటే మాత్రం ప్రతి ఒక్కరూ ఈ ఎమర్జెన్సీ నంబర్లకు డయల్ చేయండి.
100, 112, 181లాంటి నంబర్లు ఇలాంటి ఆపద సమయంలో ఆదుకునేవే.వీటిని మరింత విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది.ఈ కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంటోంది.ఏమాత్రం అనుమానంగా అనిపించినా, ఆపదలాగా భావించినా ఈ నంబర్లకు ఫోన్ చేయండి.రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఎక్కడికక్కడ పెట్రోలింగ్ బృందాలను ఏర్పాటు చేశామని, పట్టణాల్లో శక్తి బృందాలు ఉన్నాయని పోలీసలు చెబుతున్నారు.
112 నంబర్‌ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.మీ ఫోన్లోని పవర్ బటన్‌ను మూడుసార్లు నొక్కితే ఆటోమేటిగ్గా పోలీసులకు సమాచారం అందే వెసులుబాటు ఇందులో ఉంటుంది.ఇక 5 లేదా 9 నంబర్ బటన్‌ను నొక్కినా మీరు ప్రమాదంలో ఉన్నట్లు పోలీసులకు తెలిసిపోతుంది.ఇక జీపీఎస్ కారణంగా మీ లొకేషన్‌ను కూడా ఈజీగా తెలుసుకునే వీలుంటుంది.
దీనికోసం మీరు 112 ఇండియా అనే యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని అందులో మీ అత్యంత సన్నిహితుల నంబర్లను సేవ్ చేసుకోవచ్చు.మీరు ఆపదలో ఉన్నపుడు ఈ నంబర్లకు మీ లొకేషన్‌ను షేర్ చేసే వీలుంటుంది.
టెక్నాలజీ వాడకం పెరిగిపోతున్న ఈ డిజిటల్ యుగంలో ఇలాంటి వాటిని మీ రక్షణ కోసం వాడుకోవచ్చు.