రాజన్న సిరిసిల్ల జూలై : ఆగస్టు-5 వరకు ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమంలో పాల్గొనేవారు తమ వివరాలు పంపాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు.కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఇంటింటా ఇన్నోవేటర్ 2023 సంవత్సరానికి సంబంధించిన పోస్టర్ ను జిల్లా పరిశ్రమల అధికారి ఉపేందర్ రావు, డీపీఆర్ఓ మామిండ్ల దశరథం, ఈడి ఎమ్ శ్రీనివాస్, ఎల్ డి ఎమ్ మల్లిఖార్జున్ లతో కలిసి ఆవిష్కరించారు.
జిల్లాలోని గ్రామీణ, పట్టణ ఔత్సాహికులు ఆవిష్కరణలలో తమ ప్రతిభను చాటుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటింటా ఇన్నోవేషన్ కార్యక్రమం చక్కని వేదికగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ అన్నారు.రాష్ట్రంలో ఇన్నోవేషన్, సృజనాత్మకతను ప్రోత్సహించడానికి, తెలంగాణలోని మొత్తం 33 జిల్లాలు ఒకేసారి ఆయా జిల్లాల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఆవిష్కరణల ప్రదర్శనను నిర్వహిస్తున్నా యని, ఈ ప్రదర్శన జిల్లా స్థాయిలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఉంటుందని తెలిపారు.
ఈ ప్రదర్శనలో పాల్గొనడానికి అన్ని రంగాల, వర్గాల ఆవిష్కరణలను ప్రోత్సహించడం జరుగుతుందని, గ్రామీణ ఆవిష్కరణ, విద్యార్థుల ఆవిష్కరణ, వ్యవసాయ రంగ ఆవిష్కరణలు , సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల ఆవిష్కరణలు మొదలగునవి అంగీకరించబడతాయని జిల్లా కలెక్టర్ తెలిపారు.ఆవిష్కర్తలు తమ ఆవిష్కరణకు సంబంధించిన 6 వాక్యాలు, 2 నిమిషాల వీడియోను, ఆవిష్కరణ యొక్క 4 ఫోటోలు, ఆవిష్కర్త పేరు, ఫోన్ నెంబర్, వయసు, ప్రస్తుత వృత్తి, గ్రామం పేరు, జిల్లా పేరు తదితర వివరాలను సెల్ నంబర్ 9100678543 కు వాట్సాప్ చేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఇన్నోవేటర్స్ నుండి దరఖాస్తులను స్వీకరించడానికి చివరి తేదీ ఆగస్ట్ 5 అని, అందుకున్న దరఖాస్తుల నుండి మొదటి షార్ట్‌లిస్ట్ తరువాత 5 ఆవిష్కరణలు ప్రదర్శనకు ఎంపిక చేయబడుతాయని జిల్లా కలెక్టర్ తెలిపారు.