అమెరికాలో రోజుల వ్యవధిలో భారతీయ విద్యార్ధుల హత్యల నేపథ్యంలో విదేశాల్లో చదువుకుంటున్న తమ పిల్లల క్షేమం, భద్రతపై తల్లిదండ్రులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్( External Affairs Minister Jaishankar ) స్పందించారు.
పార్లమెంట్ సమావేశాల సందర్భంగా లోక్‌సభకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో .వివిధ కారణాల వల్ల 2018 నుంచి విదేశాలలో 403 మంది భారతీయ విద్యార్ధులు మరణించినట్లు తెలిపారు.వీటిలో సహజ కారణాలు, ప్రమాదాలు, వైద్యపరమైన పరిస్ధితులు వున్నాయన్నారు.

విదేశాల్లోని భారతీయ విద్యార్ధుల( Indian students ) శ్రేయస్సు కోసం, అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ఏదైనా పథకాలు , కార్యక్రమాలను ప్రవేశపెట్టిందా అంటూ తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్( MP Galla Jayadev ) అడిగిన ప్రశ్నకు జైశంకర్ బదులిస్తూ.విదేశాంగ శాఖ డేటా ప్రకారం.కెనడాలో 91, యూకేలో 48, ఆస్ట్రేలియాలో 35, రష్యాలో 40, అమెరికాలో 36, ఉక్రెయిన్‌లో 21, సైప్రస్‌లో 14, జర్మనీలో 20, ఇటలీలో 10, చైనా, ఖతార్, కిర్గిస్తాన్‌లలో ఒక్కొక్కరు చొప్పున భారతీయ విద్యార్ధులు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు.

ప్రపంచవ్యాప్తంగా సంఘర్షణ, సమస్యాత్మక ప్రాంతాల్లో భారతీయ విద్యార్ధుల భద్రత, రక్షణకు సంబంధించి ప్రభుత్వానికి ఏదైనా విధానం వుందా అని గల్లా ప్రశ్నించారు .దీనిపై జైశంకర్ మాట్లాడుతూ.భారతీయ విద్యార్ధుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అన్నారు.భారతీయ మిషన్లు విదేశీ విశ్వవిద్యాలయాలలో చదువుకోవడానికి నమోదు చేసుకున్న విద్యార్ధులకు స్వాగత ఏర్పాట్లు చేసి అన్ని రకాల సాయాలను చేస్తున్నాయని జైశంకర్ చెప్పారు.
విదేశాల్లోని యూనివర్సిటీల్లో భారతీయ విద్యార్ధులు ఎక్కడ నమోదు చేసుకున్నా , మిషన్లు వారితో ఎప్పటికప్పుడు టచ్‌లో వుంటాయని ఆయన తెలిపారు.గత మూడేళ్లలో పలు దేశాల్లో చోటు చేసుకున్న సంఘర్షణల నేపథ్యంలో విద్యార్ధులు సహా 23,906 మంది భారతీయ పౌరులను స్వదేశానికి తరలించినట్లు విదేశాంగ మంత్రి వెల్లడించారు.
ఆపరేషన్ గంగా, ఆపరేషన్ అజయ్ వీటికి ముఖ్య ఉదాహరణలని కేంద్ర మంత్రి జైశంకర్ పేర్కొన్నారు.