ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులకు మరో శుభవార్త చెప్పారు.ఈరోజు వైయస్సార్ జలకళ పథకాన్ని తాడేపల్లిలోని సీఎం కార్యాలయం నుంచి ప్రారంభించిన జగన్ చిన్న, సన్నకారు రైతులకు బోర్లు వేయించడంతో పాటు ఉచితంగా మోటార్లు కూడా బిగిస్తామని వెల్లడించారు.
సీఎం జగన్ చేసిన ఈ ప్రకటనపై రాష్ట్రంలోని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.గత ప్రభుత్వాలకు భిన్నంగా జగన్ సర్కార్ రైతు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని చెబుతున్నారు.
ఏపీలోని 13 జిల్లాలకు చెందిన అర్హులైన రైతులు వాలంటీర్లు లేదా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసి ఈ పథకానికి అర్హత పొందవచ్చు.ఉచితంగా బోర్లు వేసి రైతులకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని జగన్ తెలిపారు.
రాష్ట్రంలో రెండు లక్షల బోర్లు వేయడమే లక్ష్యంగా జగన్ సర్కార్ అడుగులు వేస్తోంది.ఈ పథకం కోసం జగన్ సర్కార్ 2,340 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది.
రైతుల పంట పొలాలకు మోటార్లు బిగించడం కోసం 1600 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది.ఈ బోర్ల ద్వారా అదనంగా 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రత్యేక సాఫ్ట్ వేర్ సహాయంతో దరఖాస్తు చేసిన రోజు నుంచి డ్రిల్లింగ్ వరకు రైతుకు సమాచారం అందే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
హైడ్రో జియోలాజికల్, జియోఫిజికల్ సర్వేలు నిర్వహించి నీరు పడే ప్రాంతాలను గుర్తించి ఆ తర్వాతే బోర్లు వేస్తారు.
ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో బోర్లు వేయడానికి బోరు రిగ్గును ఏర్పాటు చేయనుంది.గతంలో ఎలాంటి బోరుబావి నిర్మాణం చేపట్టని 2.5 ఎకరాల నుంచి 5 ఎకరాల లోపు పొలం ఉన్న రైతులు మాత్రమే ఈ పథకానికి అర్హులు.జగన్ సర్కార్ రైతులకు ఇప్పటికే రైతు భరోసా పథకం, రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రయోజనం చేకూరుస్తున్న సంగతి తెలిసిందే.