ఏపీలో కుల రాజకీయాలు ఈసడింపుగా మారాయి.ఒకప్పుడు తెరవెనుక నడిచిన కుల రాజకీయం తెరపైకి వచ్చి చిందులు తొక్కుతోంది.
సమాజంలో కులాల వారీగా పార్టీలను చీల్చి చెండాడుతున్నారు రాజకీయ ప్రముఖులు.రాజకీయ నాయకులు కులాన్ని ఎద్దేవా చేస్తూ చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయాల్లో వినడానికే అభ్యంతరకరంగా ఉంది.
ఒక్కో పార్టీకి ఒక్కో కులాన్ని అంటగడుతూ పోస్టుల దగ్గర నుంచి పదవుల వరకు అదే సామాజిక వర్గం వారికే కట్టబెడుతున్నారంటూ నాడు టీడీపీ హయాంలోనూ నేడు వైసీపీ హయాంలోనూ వినిపిస్తున్నాయి.తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ విషయంలోనూ ఇదే కులంకార్డును ఇతర పక్షాలు ప్రయోగిస్తున్నాయి.
దీంతో రాష్ట్రంలో కుల రక్కసి రాజకీయం రంకెలు వేసుకుంటూ సమాజంలో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి.రాజకీయం ఇలానే ఉంటే భవిష్యత్‌లో రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని భయాందోళన చెందుతున్నారు.
పాలించే నేతలే కులం అస్త్రాన్ని ప్రయోగిస్తుండటం చూస్తుంటే భవిష్యత్‌లో రాజకీయం వికృతంగా మారే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
నేడు రాజకీయాల్లో అధికార, విపక్షాలు కులాల పేర్లతో మరీ పిలుచుకుని కులాల కుంపట్లకు తెరలేపారు.
నిన్న మెున్నటి వరకు ఎంతో ఇంపుగా ఉన్న పేర్లను నేడు చివర కులం తగిలించి వ్యంగ్యంగా విమర్శలు చేస్తున్నారు.ఒకప్పుడు అలా పలకడానికే ఇష్టపడనివారు సైతం గళం సవరించుకోవడం ఇప్పుడు రాజకీయవర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.
చంద్రబాబు, నారా లోకేశ్, ఇతర పార్టీ నేతలంతా జగన్ రెడ్డి అంటూ సంబోధిస్తున్నారు.ఒకప్పుడు జగన్ అని పిలిచే వీరంతా జగన్ రెడ్డి అంటూ ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్నారు.
తామేం తక్కువ తిన్నామా అన్నట్లు వైసీపీ చంద్రబాబు నాయుడు, లోకేశ్ నాయుడు అంటూ తోకలు తగిలిస్తూ కులాన్ని గుర్తు చేస్తూ కుల రాజకీయాలకు పాల్పడుతున్నారు.ఇంకొందరైతే చంద్రబాబును చంద్రబాబు చౌదరి అని పవన్ కల్యాణ్‌ను పవన్ నాయుడు అని పిలవడం కూడా మెుదలు పెట్టేశారు.
టీడీపీ హయాంలో డీఎస్పీల ప్రమోషన్ల విషయంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికి ప్రమోషన్లు ఇచ్చారంటూ వైసీపీ నానా రచ్చరచ్చ చేసింది.వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని కమ్మరావతి అంటూ తీవ్ర విమర్శలు చేస్తోంది.నామినేటెడ్ పోస్టుల దగ్గర నుంచి వర్సిటీ పోస్టుల వరకు అగ్రతాంబూలం రెడ్డి సామాజిక వర్గానికే కట్టబెట్టారంటూ ఇప్పుడు టీడీపీతోపాటు ఇతర పార్టీలు విమర్శిస్తున్నాయి.ఇలా కులాల పేరుతో కుమ్మలాటల రాజకీయానికి తెరలేపారు.
నాడు విమర్శించిన చంద్రబాబే నేడు అదే లైన్‌లో పయనిస్తున్నారు.జగన్ రెడ్డి అంటూ తోకలు తగిలిస్తున్నారు.
మరి చంద్రబాబు ఎంచుకున్న కొత్తపంథా ఏ మేరకు కలిసి వస్తుందో వేచి చూడాలి.వైసీపీ నేత విజయసాయిరెడ్డి కమ్మ సామాజిక వర్గంపై ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
ఆయన వ్యాఖ్యలపై సినీ నిర్మాత బండ్ల గణేశ్ రెచ్చిపోయారు.మీకు కులం నచ్చకుంటే, కమ్మవాళ్లు నచ్చకుంటే నేరుగా తిట్టండంటూ తెలిపారు.
ప్రతి కమ్మవారు తెలుగుదేశం కాదు నేను కమ్మ వాణ్ణే కానీ, టీడీపీ కాదు సాయిరెడ్డి అంటూ ట్వీట్ చేశారు.చంద్రబాబును టీడీపీని అడ్డం పెట్టుకొని కమ్మవారిని తిట్టకండి అని సలహా ఇచ్చారు.
అధికారం శాశ్వతం కాదు, రేపు నువ్వు తప్పకుండా మాజీ అవుతావంటూ హెచ్చరించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్‌ని చూసి నేర్చుకో అంటూ ఉచిత సలహా ఇచ్చారు.వైసీపీ నేత విజయసాయి రెడ్డిని ఒక రేంజ్‌లో తిడుతూనే తన అభిమానం గురించి బండ్ల గణేశ్ ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు.విశాఖని దోచుకున్న డబ్బుతో హైదరాబాద్ కొనుక్కో.
వ్యక్తి మీద గొడవతో కులం మీద దూషణ చేస్తే జనం చెప్పు దెబ్బ రుచిచూపిస్తారు.నీ బతుకు ఎక్కడి నుంచి మొదలైందో తెలుసు.
ఎంపీగా ఉన్నావని, అధికారంలో ఉన్నానని.కళ్లు నెత్తికెక్కి ప్రవర్తిస్తున్నావు.
జగన్ ఇలాంటి వారిని మీ దగ్గర పెట్టుకోవద్దు.మీ రాజకీయ భవిష్యత్తును ఆగం చేసుకోవద్దు’ అంటూ బండ్ల గణేశ్ చెప్పుకొచ్చారు.
సీఎం జగన్‌పై మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి రెచ్చిపోయారు.సత్తా ఉంటే అమరావతికి కమ్మరావతి అని పేరు పెట్టాలని సీఎంకు సవాల్ విసిరారు.
కమ్మ సామాజికవర్గం మంచితనాన్ని బలహీనతగా చూడొద్దు.రాష్ట్రం నిలబడాలంటే అన్ని కులాలు అవసరమేనని చెప్పుకొచ్చారు.
సీఎం జగన్ సైతం కులం కార్డునే ప్రధాన అస్త్రంగా చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.ఒకప్పుడు తమ ప్రభుత్వం దళితుల పక్షపాత ప్రభుత్వం అని చెప్పుకొచ్చిన జగన్ నేడు బీసీ సామాజిక వర్గం పాట పాడుతున్నారు.
ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేతలు సైతం కులం పేరుతో రాజకీయం చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది.కుల రాజకీయాలు సమాజానికి చెడు చేయడమే తప్ప మంచివి కాదని పలువురు నేతలు విమర్శిస్తున్నారు.
రాజకీయ పబ్బం గడుపుకోడానికి ఇతర కులంపై దూషణలు, తిట్లు, పిచ్చి పైత్యం ప్రదర్శిస్తే భవిష్యత్‌లో అన్ని వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తే అవకాశం ఉందన్నారు.కుల రాజకీయాలకు స్వస్తి పలకాలని పలువురు కోరుతున్నారు.