2019 చివరిలో చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎంతగా ఉక్కిరిబిక్కిరి చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.గడిచిన ఏడాదిన్నర కాలంలో కోట్లాది మంది ప్రజలు దీని బారినపడగా.
అదే స్థాయిలో మరణాలు సైతం సంభవించాయి.కంటికి కనిపించని ఓ సూక్ష్మజీవి తనకంటే ఎన్నో రెట్లు శక్తివంతుడైన మనిషిని నాలుగు గోడల మధ్య బందీని చేసింది.
నలుగురిలోకి వెళ్లాలంటే భయం.తోటి వ్యక్తి తుమ్మితే టెన్షన్.ఆర్ధిక వ్యవస్ధ చిన్నాభిన్నం కాగా.లక్షలాది మంది రోడ్డునపడ్డారు.ఇలా ఒకటి కాదు.రెండు కాదు ఈ మహమ్మారి వల్ల ఎన్నో దారుణాలు.
2020 చివరి నాటికి ఏవో కొన్ని దేశాలు తప్పించి.అంతగా వైరస్ ఉద్ధృతి లేకపోవడం అదే సమయంలో వ్యాక్సిన్‌లు అందుబాటులోకి రావడంతో ఇక కోవిడ్ ముప్పు తప్పినట్లేనని అంతా భావించారు.
కానీ ఉత్పరివర్తనం చెంది .ఎన్నో రెట్లు శక్తిని పుంజుకుని మానవాళిపై దాడి చేయడం ప్రారంభించింది ఈ మహమ్మారి. భారత్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ వంటి దేశాలు సెకండ్ వేవ్‌తో విలవిలలాడిన సంగతి తెలిసిందే.అయితే కోవిడ్ కేసులు తిరిగి సున్నాకి ఎప్పుడు చేరుకుంటాయి.మాస్క్ లేకుండా ఎప్పుడు తిరగగలం ఇవే అమెరికా నుంచి అనకాపల్లి వరకు ప్రజల్ని వేధిస్తున్న ప్రశ్నలు.
వీటిపై స్పందించారు అమెరికా సర్జన్ జనరల్ భారత సంతతికి చెందిన డాక్టర్ వివేక్ మూర్తి.
ఆసుపత్రుల్లో రోగులు లేకపోవడం, మరణాల సంఖ్య తగ్గినప్పుడే కోవిడ్‌పై విజయం సాధించినట్లని ఆయన అభిప్రాయపడ్డారు.వైరస్‌ను అరికట్టడంలో టీకాలు కీలక పాత్ర పోషిస్తాయన్న ఆయన.బ్రేక్ త్రూ కేసులు అరుదుగా సంభవించే అవకాశం వుందని చెప్పారు.
కాగా, డాక్టర్ వివేక్ మూర్తి కుటుంబంలో 10 మందిని కోవిడ్ మహమ్మారి బలి తీసుకుంది.
ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పారు.ప్రజలు కరోనా నుంచి తమను తాము రక్షించుకోవడానికి ఖచ్చితంగా టీకాలు వేయించుకోవాలని సూచించారు.
తన కుటుంబంలో జరిగిన విషాదం మరే ఇంట్లోనూ జరగకుండా వుండాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ టీకాలు వేయించుకోవాలని వివేక్ మూర్తి విజ్ఞప్తి చేశారు.

మరోవైపు అమెరికాలోని పలు ఆసుపత్రులు తమ ఐసీయూల్లో వున్న కేసుల సంఖ్య ‘‘సున్నా’’గా వుందని నివేదించాయి.అయితే యూఎస్ సీడీసీ గణాంకాల ప్రకారం .అమెరికాలో రోజువారీ కొత్త కోవిడ్ కేసులు 1,50,000కు చేరుకున్నాయి.ఇది గడిచిన వారంతో పోలిస్తే 4.9 శాతం ఎక్కువ.