విద్య, ఉపాధి, ఉద్యోగం ఇలా ప్రపంచ నలుమూలలకు వలస వెళ్లారు సిక్కులు.సహజంగానే ధైర్య సాహసాలకు, నిజాయితీకి, తెగింపుకు ప్రతీక అయిన సిక్కులు.
ఆయా దేశాల్లోని సాయుధ బలగాల్లో చేరి విశేషంగా రాణిస్తున్నారు.అంతేకాదు దేశ రక్షణ కోసం వీర మరణం పొందినవారు ఎందరో.
అందుకే సిక్కు వీరులకు దాదాపుగా ప్రతి దేశం గౌరవం కల్పిస్తోంది.తాజాగా సిక్కు సంతతి అధిక సంఖ్యలో స్థిరపడిన ఆస్ట్రేలియాలోనూ వీరికి సముచిత ప్రాధాన్యం లభిస్తోంది.
దేశ చరిత్రలోనే తొలిసారిగా సిక్కు వీరులకు వార్ మెమోరియల్‌ను నెలకొల్పేందుకు ఆస్ట్రేలియాలోని బ్లాక్‌టౌన్ సిటీ సిద్ధమైంది.ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను సిటీ కౌన్సిల్ ఆమోదించింది.
ప్రస్తుతం దీనిని కమ్యూనిటీ కన్సల్టేషన్ కోసం పంపారు.
సిటీ కౌన్సిల్ మేయర్ టోనీ బ్లీస్‌డేల్ మీడియాతో మాట్లాడుతూ.
చారిత్రాత్మకంగా, బ్రిటీష్ సామ్రాజ్యంలో సిక్కు సమాజం కీలక పాత్ర పోషించిందని గుర్తుచేశారు.మనందరి కోసం అనేక మంది సిక్కులు యుద్ధ క్షేత్రాల్లో జీవితాలను త్యాగం చేశారని ఆయన కొనియాడారు.
ఇలాంటి వారిని గౌరవించుకునేందుకు ఒక స్మారక చిహ్నాన్ని నిర్మించడం గర్వంగా వుందన్నారు.
ఈ స్మారక చిహ్నం నిర్మాణానికి సంబంధించి గతేడాది ఫతే ఫౌండేషన్ విరాళాల సేకరణ ప్రారంభించింది.
ఈ సంస్థ వాలంటీర్ అమరీందర్ బజ్వా మాట్లాడుతూ.తాము భారతీయ సైనికుల వారసత్వాన్ని, ముఖ్యంగా సిక్కుల చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాలని భావిస్తున్నట్లు చెప్పారు.
ఈ ప్రాజెక్ట్‌కు ఆస్ట్రేలియాలోని సిక్కు కమ్యూనిటీ మద్ధతు లభిస్తోందని అమరీందర్ చెప్పారు.ఈ స్మారక చిహ్నానికి సంబంధించి వాస్తు శిల్పులు, ఆర్కిటెక్ట్‌లతో డిజైన్లు రూపొందించే పనిలో నిమగ్నమై వున్నారని ఆయన తెలిపారు.

సిక్కు సైనికులు ఐరోపా, ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, ఆసియాలోని పలు ప్రాంతాల్లో రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటీష్ సైన్యం తరపున పోరాడారు.ముఖ్యంగా ఆస్ట్రేలియాలోని గల్లిపోలీ పోరులోనూ వారు ధైర్య సాహసాలు ప్రదర్శించారు.ఇందుకు సంబంధించిన వివరాలు 2000 ప్రారంభంలో బయటకు వచ్చాయి.
కాగా, భారతీయ సైనికుల యుద్ధ స్మారక చిహ్నం ఇప్పటికే సిడ్నీలో వుంది.2018లో చెర్రీబ్రూక్ వద్ద యుద్ధ విరమణ దినోత్సవం సందర్భంగా దీనిని ఆవిష్కరించారు.అంతకుముందే 2017లో బ్రిస్బేన్‌లోని వార్ మెమోరియల్‌లోనూ ఆస్ట్రేలియా యుద్ధాల్లో పాలుపంచుకున్న భారతీయ సైనికులకు గౌరవం కల్పించారు.
ఇక తాజాగా నిర్మించ తలపెట్టిన గ్లెన్‌వుడ్ సిక్కు మెమోరియల్ దక్షిణార్థ గోళంలో మొదటిదని చెబుతున్నారు.