తొలి దశ కరోనాను అద్భుతంగా ఎదుర్కొని ప్రపంచదేశాల నీరాజనాలు అందుకున్న ఆస్ట్రేలియా సెకండ్ వేవ్‌లో.అది కూడా డెల్టా వేరియంట్‌ను అదుపు చేయలేకపోతోంది.
నెలల తరబడి దేశాన్ని లాక్డౌన్లో వుంచుతున్నప్పటికీ ఆశించిన మేరకు ఫలితం కనిపించడం లేదు.ప్రజలు సైతం ప్రభుత్వ నిర్ణయాల పట్ల విసుగెత్తి పోతున్నారు.
లాక్డౌన్ ఎత్తివేసి తమకు స్వేచ్ఛను ప్రసాదించాలని కోరుతూ వీధుల్లోకి వస్తున్నారు.తాజాగా సెకండ్ వేవ్‌లోనే ఎన్నడూ లేని విధంగా ఒకే రోజులో వెయ్యి కేసులు నమోదు కావడంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం ఉలిక్కిపడింది.
ముఖ్యంగా దేశంలోనే అతిపెద్ద నగరం సిడ్నీలో తీవ్రత అధికంగా వుంది.
న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రం నుంచే 1029 కేసులు వెలుగుచూస్తే అందులో ఒక్క సిడ్నీలోనే 969గా ఉంది.
దీంతో సిడ్నీ నగరం ఇప్పుడు కొవిడ్ హాట్‌స్పాట్‌గా మారింది.డెల్టా వేరియంట్ వల్ల వ్యాప్తి తీవ్రంగా వుంది.వైరస్ లక్షణాలతో ప్రజలు ఆసుపత్రులకు పరుగులు తీస్తుండటంతో దవాఖానాలు కిటకిటలాడుతున్నాయి.రోగుల తాకిడిని తట్టుకోవడంతో పాటు అత్యవసర వైద్యం అందించేందుకు వీలుగా ఆస్పత్రుల బయట టెంట్లు ఏర్పాటు చేస్తున్నారు.
మరోవైపు దేశంలోని ప్రధాన నగరాలైన మెల్బోర్న్, కాన్‌బెర్రాల్లో కూడా కఠిన లాక్డౌన్ అమలు చేస్తున్నారు.అయినప్పటికీ అక్కడా కూడా కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి.
ప్రస్తుతం రోజుకు మూడు లక్షల మందికి వ్యాక్సిన్లు వేస్తుండగా.ఈ సంఖ్యను మరింత వేగవంతం చేయాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయించింది.
ఇక ఇప్పటి వరకు దేశం మొత్తం మీద 47,700 పాజిటివ్ కేసులు, 989 మరణాలు సంభవించాయి.మరోవైపు వ్యాక్సినేషన్ విషయానికి వస్తే.దేశవ్యాప్తంగా 16 ఏళ్లు పైబడిన వారిలో 32 శాతం మందికి రెండు డోసుల టీకా పూర్తయ్యింది.54 శాతం మంది ప్రజలు ఒక్క డోసు వ్యాక్సిన్ తీసుకున్నారు.దేశ జనాభాలో కనీసం 70 శాతం మందికి వ్యాక్సిన్ పూర్తయితే గానీ లాక్‌డౌన్‌ను ఎత్తివేసే ఉద్దేశం లేదని ఇటీవల ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ తేల్చిచెప్పారు.ఈ క్రమంలో ఊహించని విధంగా కొత్త కేసులు వెలుగుచూడడం ప్రభుత్వానికి మింగుడుపడటం లేదు.

మరోవైపు నెలల తరబడి తమను నాలుగు గోడల మధ్య బంధించడాన్ని జనం జీర్ణించుకోలేకపోతున్నారు.తమకు లాక్డౌన్ నుంచి విముక్తి కావాలంటూ గత శనివారం సిడ్నీ, మెల్బోర్న్ నగరాల్లో వేలాది మంది జనం రోడ్ల మీదకి చొచ్చుకొచ్చారు.ఈ ఊహించని పరిణామంతో అవాక్కయిన పోలీసులు, సైన్యం గుంపును చెదరగొట్టి వందలాది మందిని అదుపులోకి తీసుకున్నారు.మెల్బోర్న్లో మౌంట్ పోలీసులు పెప్పర్ స్ప్రేను ఉపయోగించి.పోలీస్ లైన్ల వైపు పరిగెడుతున్న 4,000 మందిని చెదరగొట్టారు.అయితే సిడ్నీలో మాత్రం పోలీసులను ఆందోళనకారులు ప్రతిఘటించారు.
ఈ ఆందోళనలో వందల మందిని పోలీసులు అరెస్ట్ చేసి భారీగా జరిమానా విధించారు.