తెలంగాణలో తెలుగుదేశం మళ్లీ యాక్టివ్ అవుతోంది.సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో , తెలంగాణలో టిడిపిని బలోపేతం చేయడం ద్వారా, రాబోయే ఎన్నికల్లో కొన్ని ప్రాంతాల్లో అయినా సత్తా చాటుకోవాలనే లక్ష్యంతో టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఉన్నారు.
ఈ మధ్యనే తెలంగాణ టిడిపికి కాసాని జ్ఞానేశ్వర్ ను అధ్యక్షుడిగా నియమించారు.రాబోయే ఎన్నికల్లో అన్ని ప్రధాన పార్టీలకు గెలుపు అత్యవసరం కావడంతో, తెలంగాణలో టిడిపి బలంగా ఉన్న ప్రాంతాల్లో సీట్లను సాధించడం ద్వారా, కింగ్ మేకర్ కావాలనే లక్ష్యంతో చంద్రబాబు పార్టీకి జవసత్వాలు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు.
ఈరోజు ఖమ్మంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ బలంగా ఉంది.
ఇక్కడ పార్టీకి బలమైన క్యాడర్ ఉండడంతో, వారందరినీ యాక్టివ్ చేసే ఉద్దేశంతో చంద్రబాబు ఈరోజు టీడీపీ శంఖారావానికి శ్రీకారం చుట్టారు.
ఈ నేపథ్యంలోనే చంద్రబాబు భారీ కాన్వాయ్ తో హైదరాబాద్ నుంచి ఖమ్మం రోడ్డు మార్గం ద్వారా చేరుకాబోతున్నారు.
హైదరాబాద్ నివాసం నుంచి ఇప్పటికే బయలుదేరిన బాబు రసూల్ పూరాలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు.అనంతరం రంగారెడ్డి , సూర్యాపేట జిల్లాలో ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలకబోతున్నాయి.
సూర్యాపేట సమీపంలో మధ్యాహ్నం భోజనం విరామం కోసం బాబు ఆగనున్నారు.అనంతరం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఖమ్మం జిల్లా సరిహద్దుల్లోకి చేరుకుంటారు.
అక్కడ భారీగా టిడిపి నాయకులు చంద్రబాబుకు స్వాగతం ఏర్పాట్లు చేశారు.కూసుమంచి మండలం కేశవపురంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరిస్తారు.
అనంతరం ఖమ్మం చేరుకోబోతున్నారు. వరంగల్ క్రాస్ రోడ్ వద్ద భారీ ద్విచక్ర వాహనాల ర్యాలీతో బాబుకు స్వాగతం ఏర్పాట్లు చేశారు.

అనంతరం మయూరి సెంటర్ నుంచి ఓపెన్ టాప్ వాహనంలో ర్యాలీలో పాల్గొనబోతున్నారు.అక్కడ నుంచి బహిరంగ సభ స్థానం కు చేరుకుంటారు.ఈ మేరకు భారీగా ఏర్పాట్లను తెలంగాణ టిడిపి ఆధ్వర్యంలో చేపట్టారు.రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని భారీగా జన సమీకరణ చేపట్టబోతున్నారు.బాబు సభను సక్సెస్ చేయడం ద్వారా, తెలంగాణలో టిడిపి బలంగా ఉందనే సంకేతాలను రాష్ట్రమంతా పంపించాలనే వ్యూహంతో తెలంగాణ టిడిపి ఉంది.దీంతో ఈ సభను సక్సెస్ చేయాలనే పట్టుదలతో తెలంగాణ టిడిపి విభాగం భారీగా కసరత్తు మొదలుపెట్టింది.