యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ)లోని రాస్ అల్ ఖైమాలో సంభవించిన భారీ వరదల్లో గల్లంతైన భారత్‌కు చెందిన కార్మికుడి మృతదేహాన్ని ఆరు రోజుల తర్వాత ఒమన్‌లో గుర్తించారు.స్థానిక పోలీసులు, ఒమన్‌లోని సెర్చ్ అండ్ రెస్క్యూ టీంల సహకారంతో అతని మృతదేహాన్ని కనుగొన్నట్లు రాస్ అల్ ఖైమా పోలీసులు వెల్లడించారు.
ఆర్ఏకే పోలీస్ కమాండర్ మేజర్ జనరల్ అలీ అబ్దుల్లా బిన్ అల్వాన్ అల్ నుయిమి తెలిపిన వివరాల ప్రకారం… జనవరి 11న ఒక లోయలో తలెత్తిన వరదలో భారతీయ కార్మికుడు గల్లంతయ్యారు.సమాచారం అందుకున్న వెంటనే ఆర్ఏకే పోలీసు బృందాలు, సెర్చ్ అండ్ రెస్క్యూ ఫోర్స్, సాయుధ దళాలు, ఎయిర్ వింగ్ విభాగం, కే 9 స్క్వాడ్, అంబులెన్స్‌లతో గాలింపు చర్యలు చేపట్టినట్లు అబ్దుల్లా పేర్కొన్నారు.
ఆరు రోజులుగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌లో భాగంగా గురువారం ఒమన్‌లోని ఘమ్దా బీచ్‌లోని రాళ్లలో మృతదేహం చిక్కుకున్నట్లు గురువారం గుర్తించారు.ఆ వెంటనే ఒమన్ పోలీసులను అప్రమత్తం చేసి మృతదేహాన్ని వెలికి తీశారు.అతని గుర్తింపును ధృవీకరించేందుకు పోలీసులు కార్మికుడి స్పాన్సర్ సాయాన్ని తీసుకున్నారు.బలమైన అల కార్మికుడి మృతదేహాన్ని ఆనకట్ట నుంచి బీచ్‌కు నెట్టివేసి ఉండవచ్చునని అల్ హుమైది అభిప్రాయపడ్డారు.