కెనడాలో కాల్పులు కలకలం సృష్టించాయి.ఒట్టావా డౌన్‌టౌన్‌లో బుధవారం జరిగిన ఈ ఘటనలో ఓ వ్యక్తి మరణించగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
ఘటన జరిగిన ప్రదేశానికి కూతవేటు దూరంలోనే దేశ పార్లమెంట్ ఉండటంతో భద్రతా సిబ్బంది ఉరుకులు పరుగులు పెట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉదయం 7.30 గంటలకు కాల్పులు జరిగినట్లుగా తెలుస్తోంది.గాయపడిన వారిని భద్రతా సిబ్బంది ఆసుపత్రికి తరలించారు.
కాల్పులకు పాల్పడిన దుండగుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.పోలీస్ ఇన్స్‌పెక్టర్ ఫ్రాంకోయిస్ డి ఆస్ట్‌ని లక్ష్యంగా చేసుకుని దుండగుడు కాల్పులకు తెగబడ్డాడని స్థానిక మీడియా కథనాలు ప్రసారం చేసింది.
అయితే దీనిపై పోలీస్ శాఖ ఎలాంటి ప్రకటన చేయలేదు.
2014లో ఓ దుండగుడు కెనడా పార్లమెంట్ భవనంలోకి దూసుకెళ్లి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు.వెంటనే స్పందించిన భద్రతా దళాలు అతడిని ముట్టుబెట్టాయి.అంతకుముందే జాతీయ యుద్ధ స్మారక కేంద్రం వద్ద విధుల్లో ఉన్న సైనికుడిని ముష్కరుడు కాల్చిచంపాడు.
అప్పట్లో ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం కలిగించింది.