రాజన్న సిరిసిల్ల:ధాన్యం కొనుగోలు చేసేందుకు ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాలలో సరైన వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ( District Collector Sandeep Kumar Jha )అన్నారు.గురువారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ కోనరావుపేట మండలంలోని నిజామాబాద్ గ్రామంలో ఏర్పాటు చేయుచున్న వరి కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఈ రోజు నుండి ప్రారంభించాలని, కొనుగోలు కేంద్రాలలో అకాల వర్షాల వల్ల ధాన్యం తడవకుండా అవసరమైన మేర టార్ఫాలిన్ కవర్లు అందుబాటులో ఉంచుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.ధాన్యం కొనుగోలుకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా గన్ని బ్యాగుల స్టాక్ ఎప్పటికప్పుడు పరిశీలించాలని కలెక్టర్ తెలిపారు.
నాణ్యమైన ధాన్యాన్ని మద్దతు ధరపై కొనుగోలు చేసి వెంటనే సంబంధిత రైస్ మిల్లులకు తరలించాలని,సన్న బియ్యం కొనుగోలు సమయంలో ప్రభుత్వ మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించాలని కలెక్టర్ అధికారులకు పేర్కొన్నారు.ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చే రైతుల కోసం అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని, కొనుగోలు కేంద్రాలలో త్రాగునీరు, టాయిలెట్ల, విద్యుత్ సరఫరా, టెంట్, కుర్చీలు వంటివి ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
ఈ తనిఖీలలో అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యా నాయక్( Additional Collector Kheemya Naik ), జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వసంత లక్ష్మి, పౌర సరఫరాల మేనేజర్ రజిత, జిల్లా సహకార శాఖ అధికారి రామకృష్ణ, ఎంపీడీఓ శ్రీనివాస మూర్తి, తదితరులు ఉన్నారు.