రాజన్న సిరిసిల్ల జిల్లా : భారత వాతావరణ శాఖ నివేదిక నేపథ్యంలో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న సందర్భంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఒక ప్రకటన లో తెలిపారు.జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
నీటి పారుదల శాఖ, రోడ్లు, భవనాలు శాఖ, పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ, అలాగే మున్సిపల్ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు స్థానికంగా అందుబాటులో ఉండాలని, కల్వర్టులు, రోడ్ల పరిస్థితిని కనిపెట్టుకుంటూ ఉండాలని మానేరు నది పరివాహక ప్రాంతం, చెరువులు, జలాశయాల నీటి మట్టాలను పర్యవేక్షిస్తూ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు.అధికారులు అందుబాటులో ఉంది సహాయక చర్యల్లో పాల్గొనాలని సూచించారు.
భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.ప్రజలు బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ జిల్లా యంత్రాంగానికి సహకరించాలని సూచించారు.
జిల్లా వ్యాప్తంగా అధికారులు శిథిలమైన ఇండ్లు, లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు.