రాజన్న సిరిసిల్ల జిల్లా : మార్చి 3వ తేదీ నుంచి 5వ తేదీ దాకా నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ పూజారి గౌతమి పిలుపునిచ్చారు.పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహణపై వైద్య, ఐసీడీఎస్, మున్సిపల్, పంచాయతీ రాజ్, సెస్, లయన్స్, రోటరీ క్లబ్, జిల్లా సంక్షేమ శాఖ, వివిధ శాఖల అధికారులతో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం లోని అదనపు కలెక్టర్ చాంబర్లో సోమవారం సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడారు.వచ్చే నెల(మార్చి) 3వ తేదీ నుంచి 5 వ తేదీ దాకా నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొనాలని సూచించారు.
ప్రతీ స్కూల్ ప్రార్థన సమయంలో, మున్సిపల్, గ్రామ పంచాయతీ చెత్త సేకరించే సమయంలో వాహనాలపై ప్రచారం చేయాలని ఆదేశించారు.మహిళా సంఘాల సిబ్బందికి, అంగన్వాడీ లకు వచ్చే తల్లులకు బాధ్యులు అవగాహన కల్పించాలని సూచించారు.
బస్టాండ్, మార్కెట్, ఇతర రద్దీ ప్రాంతాల్లో పోస్టర్లు, బ్యానర్లు పెట్టేందుకు, పల్స్ పోలియో చుక్కలు వేసే రోజుల్లో వైద్య సిబ్బందికి టోపీలు, ఆహార పదార్థాలు ఇచ్చేందుకు రోటరీ, లయన్స్ క్లబ్ బాధ్యులు సహకరించాలని అదనపు కలెక్టర్ కోరారు.
అన్ని శాఖల అధికారులు కూడా అందరికీ కార్యక్రమం పై అవగాహన కల్పించాలన్నారు.
ఇటుక బట్టీలు, ఇతర పనులు చేసే కూలీల పిల్లలకు కూడా పోలియో చుక్కలు వేసేలా కార్యాచరణ సిద్దం చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఐదేండ్ల లోపు వయసు ఉన్న పిల్లల తల్లితండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని అదనపు కలెక్టర్ పిలుపునిచ్చారు.
జిల్లాలో ఐదేండ్లలోపు మొత్తం పిల్లలు.
జిల్లాలో ఐదేండ్ల లోపు పిల్లలు మొత్తం 44,770 మంది ఉన్నారని ఇంచార్జీ డీఎంహెచ్ఓ డాక్టర్ రజిత తెలిపారు.జిల్లాలో మొత్తం 394 కేంద్రాలు ఏర్పాటు చేసి, పిల్లలకు పోలియో చుక్కలు వేస్తామని వివరించారు.
ఈ సమావేశంలో ఇంచార్జీ డీఎంహెచ్ఓ డా. రజిత డిప్యూటీ డీఎంహెచ్ఓ డా.శ్రీ రాములు, డీపీఓ వీర బుచ్చయ్య, ప్రోగ్రామ్ అధికారి డా.నయీమా, సీడీపీఓ లు ఎల్లయ్య, అలేఖ్య, మున్సిపల్ ఈఈ ప్రసాద్, జీసీడీఓ పద్మజ, ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.