యాదాద్రి భువనగిరి జిల్లా: తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్( CM KCR ) ప్రభుత్వ పాలనలో అభివృద్ధి సంక్షేమంల సమ్మిళిత ప్రగతితో దేశానికి ఆదర్శంగా ముందడుగు వేస్తుందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.మంగళవారం ఆయన చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం చేనేత సహకార సంఘాల ఆధ్వర్యంలో నిర్మించనున్న హ్యాండ్లూమ్ మోడరన్ సేల్స్ షోరూం నిర్మాణానికి మంత్రి జగదీష్ రెడ్డితో కలిసి భూమి పూజ చేశారు.
అనంతరం దండు మల్కాపూర్ ఇండస్ట్రియల్ పార్కులో తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవంలో పాల్గొని మాట్లడుతూ… వ్యవసాయం,విద్యుత్తు, సాగు,తాగునీరు,విద్య, వైద్యం,ఐటి,పర్యావరణం, పారిశ్రామిక రంగం,మౌలిక వసతుల కల్పనతో పాటు ఏ రంగంలోనైనా తెలంగాణ సాధించిన ప్రగతి ఇవాళ దేశం గర్వపడే రీతిలో ఉందన్నారు.ఇందుకు జాతీయ స్థాయిలో పట్టణ ప్రగతిలో సాధించిన 26 స్వచ్ఛ అవార్డులు,పల్లె ప్రగతిలో సాధించిన 30% అవార్డులే నిదర్శనన్నారు.
రెండువేల ఫించన్ తీసుకునే ముసలమ్మ, పారిశ్రామిక రాయితీలు అందుకునే పారిశ్రామిక వేత్తలతో కూడిన తెలంగాణ సంక్షేమం, అభివృద్ధితో సమ్మిళిత పురోగమనం సాధిస్తుందని సమగ్ర,సమీకృత, సమ్మిళిత,సమతుల్య పద్ధతిలో తెలంగాణ ప్రాంతం పర్యావరణ, పారిశ్రామిక రంగాలలో వృద్ధి సాధిస్తుందన్నారు.తెలంగాణ వచ్చేనాటికి రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి 68 లక్షల మెట్రిక్ టన్నులు కాగా,నేడు మూడున్నర లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకుందన్నారు.
తొమ్మిదేళ్లలో ఐటి ఎగుమతులు 56 వేల కోట్లు నుంచి రెండు లక్షల 41 వేల కోట్లకు పెరిగాయన్నారు.నాడు 3 లక్షల మంది ఉద్యోగులు ఐటీ రంగంలో ఉంటే,నేడు 9లక్షల 50వేలకు చేరుకుందని ఇవన్నీ గణాంక సంస్థల లెక్కలేనన్నారు.
రాష్ట్ర అవతరణ దశాబ్ది వేళ రాష్ట్రం సాధించిన అభివృద్ధిని అందరికీ చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.పరిశ్రమలకు పారదర్శకంగా అనుమతులు ఇచ్చే రాష్ట్రంగా దేశంలోనే తెలంగాణ( Telanagana 0 అగ్రగామిగా ఉందన్నారు.
తెలంగాణ టీఎస్ ఐ పాస్( TS-iPASS ) పద్ధతి అమెరికాలో కూడా లేదంటూ అక్కడ పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు అమెరికా పర్యటనలో నాకు చెప్పడం జరిగిందన్నారు.పరిశ్రమలు,పెట్టుబడులు,ఉద్యోగ కల్పన పెరుగుదలతో పాటు పర్యావరణ పురోగతిలో కూడా తెలంగాణ హరితహారం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద కార్యక్రమంగా చేపట్టిందన్నారు.7.7% పచ్చదనం వృద్ధి సాధించి, 241 కోట్ల మొక్కలు నాటిన హరిత యజ్ఞంలో ఐదు లక్షల 13వేల ఎకరాలకు కొత్త పచ్చదనం వచ్చిందన్నారు.పర్యావరణ,పారిశ్రామిక రంగాలలో దేశంలో తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచిందన్నారు.తెలంగాణ వస్తే పరిశ్రమలు పెట్టబడులు రావని, మనకు పరిపాలన చేతకాదని చెప్పిన వారికి తొమ్మిదేళ్ల పాలనలో తెలంగాణ అన్నింటా దేశంలో ఆదర్శంగా నిలిచి దేశానికి పాఠాలు నేర్పుతోందన్నారు.తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ హైదరాబాద్ న్యూయార్క్ మాదిరిగా తయారైందనడం మనకు గర్వకారణమన్నారు.
26 ఏళ్లు నరేంద్ర మోడీ పాలించిన గుజరాత్ రాష్ట్రంలో పవర్ హాలిడేలు అమలవుతున్నాయని, తెలంగాణలో నిరంతర విద్యుత్తు సరఫరా జరుగుతుందన్నారు.పచ్చదనం కోసం పంచాయతీలు, పారిశ్రామిక సంస్థలు కచ్చితంగా 10% వెచ్చించాలని చెప్పిన ఏకైక సీఎం కేసీఆర్ అన్నారు.సీఎం కేసీఆర్ రేపటి ఎన్నికల గురించి కాకుండా రేపటి తరం భవిష్యత్తు గురించి ఆలోచించే దార్శనిక నేత అన్నారు.65 ఏళ్లలో తెలంగాణ ప్రాంతంలో ఎంత అభివృద్ధి జరిగిందో కేసీఆర్ తొమ్మిదేళ్ల పాలనలో అంతకు రెట్టింపు అభివృద్ధి జరిగిందన్నారు.అమెరికాలో ఇంజనీర్ల సదస్సులో అక్కడి ఇంజనీర్లు కాలేశ్వరం ప్రాజెక్టు గురించి గొప్పగా చెబుతూ వివిధ దేశాలకు కాలేశ్వరం నిర్మాణం పాఠం వంటిదని చెప్పడం గర్వంగా భావిస్తున్నామని,1850 ఎకరాల పారిశ్రామిక పార్కులో మంచినీరు, విద్యుత్,మౌలిక వసతులు కల్పిస్తామన్నారు.
టైల్స్ ఫ్యాక్టరీ,రైస్ హబ్ కు కూడా అన్ని వసతులు కల్పిస్తామన్నారు.తెలంగాణ పారిశ్రామిక వేత్తలు సంపద పెంచి అందరికీ పంచేరీతిలో పనిచేయాలని, పారిశ్రామిక పార్కు పూర్తయితే 40వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత పారిశ్రామిక వేత్తలపై ఉందన్నారు.
స్కిల్ బిల్డింగ్లో స్థానిక యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, గాదరి కిషోర్,ఫైళ్ల శేఖర్ రెడ్డి,చిరుమర్తి లింగయ్య, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్,గీత కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవి,ఆయిల్ ఫెడ్ చైర్మన్ కె.రామకృష్ణారెడ్డి,జడ్పీ చైర్మన్ ఎలిమినేతి సందీప్ రెడ్డి,యాదాద్రి కలెక్టర్ పమేలా సత్పతి సహా పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు,అధికారులు పాల్గొన్నారు.