శాస్త్రవేత్తలు సముద్రపు అట్టడుగు లోతుల్లో( Deep Sea ) అద్భుతమైన ఆవిష్కరణ చేశారు.మనుషులు ఊహించలేని భయంకరమైన పరిస్థితుల్లో వేల సంఖ్యలో కొత్త రకం సూక్ష్మజీవులు( Microbes ) జీవిస్తున్నాయని కనుగొన్నారు.
ఇటీవల జరిగిన ఒక అధ్యయనంలో, మరియానా ట్రెంచ్(
Mariana Trench ) వంటి లోతైన సముద్ర ప్రాంతాలను పరిశోధించారు.దాదాపు 6 కిలోమీటర్ల లోతు వరకు ఏకంగా 7,500లకు పైగా వింతైన సూక్ష్మజీవులు ఉన్నాయని తేల్చారు.
ఈ పరిశోధన ‘హడల్ జోన్’( Hadal Zone ) గురించి కొత్త విషయాలను బయటపెట్టింది.హడల్ జోన్ అంటే సముద్ర మట్టం నుంచి 6,000 మీటర్ల నుండి మొదలై 11,000 మీటర్ల వరకు ఉండే ప్రాంతం.
దీని లోతు ఏకంగా 30 ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌లను ఒకదానిపై ఒకటి పేర్చినా లేదా ఒకటిన్నర ఎవరెస్ట్ పర్వతాలను కలిపినా అంత లోతు ఉంటుంది.ఇంతటి భయంకరమైన ఒత్తిడి, గడ్డకట్టే చలి, తినడానికి తిండి లేని పరిస్థితుల్లో కూడా సూక్ష్మజీవులు నివసిస్తున్నాయని తెలిసి ఆశ్చర్యపోయారు శాస్త్రవేత్తలు.
ఇవి గ్రహాంతరవాసుల ఏంటి అని వారు నోరెళ్లబెట్టారట.

చైనా శాస్త్రవేత్తలు ఏకంగా 33 సార్లు లోతైన సముద్రంలోకి డైవ్ చేసి మరీ శాంపిల్స్ సేకరించారు.మనుషులు వెళ్లగలిగే సబ్‌మెర్సిబుల్ వాహనాన్ని ఉపయోగించి సముద్రపు నేల నుండి, నీటి నుంచి నమూనాలు సేకరించారు.వాళ్లు కనుగొన్న విషయాలు దిమ్మతిరిగేలా చేశాయి.
తెలిసిన సూక్ష్మజీవుల్లో 90% జాతులు ఇంతకు ముందు ఎప్పుడూ చూడనివి, పూర్తిగా కొత్తవి ఉన్నాయి.

ఈ అధ్యయనంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి.ఈ సూక్ష్మజీవులు ప్రత్యేకమైన జీవన విధానాన్ని అలవర్చుకున్నాయని తెలిసింది.కొన్ని సూక్ష్మజీవులు చాలా చిన్న జన్యువులను కలిగి ఉన్నాయి.
దీనివల్ల తక్కువ వనరులు ఉన్నా అవి బతకగలవు.అంతేకాదు, విపరీతమైన ఒత్తిడిని, చలిని తట్టుకోవడానికి ప్రత్యేకమైన ఎంజైమ్‌లను తయారు చేసుకుంటాయి.
మరికొన్ని సూక్ష్మజీవులు పెద్ద జన్యువులను కలిగి ఉంటాయి.దీనివల్ల రకరకాల పోషకాలను ఉపయోగించుకోగలవు, పరిస్థితులు మారినా తట్టుకుని బతకగలవు.ఈ సూక్ష్మజీవులు ఒంటరిగా బతకవు.ఒకదానితో ఒకటి కలిసి ఒక సమాజంగా ఏర్పడతాయి.
పోషకాలను పంచుకుంటాయి, ఒక రక్షణ కవచంలాంటి ‘బయోఫిల్మ్’ను తయారు చేసుకుని కఠినమైన పరిస్థితుల నుంచి కాపాడుకుంటాయి.
ఈ పరిశోధన వివరాలు “మరియానా ట్రెంచ్ ఎన్విరాన్‌మెంట్ అండ్ ఎకాలజీ రీసెర్చ్ (MEER)” ప్రాజెక్ట్ ద్వారా అందరికీ అందుబాటులో ఉన్నాయి.