ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు( Gulf countries ) వెళ్లిన భారతీయులు అక్కడ కేసుల్లో చిక్కుకుంటూ జైలు శిక్షలను అనుభవిస్తున్నారు.ఇటీవల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో షెహజాదా అనే భారతీయురాలికి మరణశిక్షను అమలు చేసిన ఘటన దేశ ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది.
ఆమెను కాపాడేందుకు కుటుంబ సభ్యులు, భారత ప్రభుత్వం చివరి వరకు శ్రమించినా ఫలితం లభించలేదు.ఈ ఘటనను మరిచిపోకముందే మరో ఇద్దరు భారతీయులకు యూఏఈ ప్రభుత్వం మరణశిక్షలను అమలు చేయడం దిగ్భ్రాంతిని కలిగించింది.
వీరిద్దరూ కేరళకు చెందిన ప్రవాస భారతీయులు.
కాసర్‌గోడ్ జిల్లా చీమేని పొడవూరుకు చెందిన మురళీధరన్, కన్నూరు జిల్లా తలస్సేరి సమీపంలోని కున్నోత్‌కు చెందిన మహమ్మద్ రినాష్‌లకు యూఏఈలో మరణ శిక్ష పడింది.43 ఏళ్ల మురళీధరన్ మరో మలయాళీని హత్య చేసిన కేసులో దోషిగా తేలగా.28 ఏళ్ల రినాష్ యూఏఈ జాతీయుడిని హత్య చేసిన కేసులో దోషిగా తేలాడు.మురళీధరన్‌కు తండ్రి కేశవన్, తల్లి జానకై , తమ్ముడు ముఖేష్ ఉన్నారు.అతని చెల్లెలికి ఇటీవల వివాహం జరిగింది.

మురళీధరన్ 2006లో ఉద్యోగం కోసం యూఏఈకి వెళ్లాడు.ఆ తర్వాత ఒక్కసారి కూడా ఇంటికి వెళ్లలేకపోయాడు.2009లో మలప్పురం జిల్లాలోని తిరూర్‌కు చెందిన ఓ వ్యక్తిని హత్య చేసిన కేసులో అతనిని పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ కేసులో మురళీధరన్‌కు క్షమాభిక్ష పొందేందుకు అతని కుటుంబం ఎన్నో ప్రయత్నాలు చేసింది.
దీనికి కావాల్సిన నిధుల కోసం వారు పలు ఆస్తులను అమ్మాల్సి వచ్చింది.అయినప్పటికీ ఫలితం లభించకపోగా.
మురళీధరన్‌కు యూఏఈ ప్రభుత్వం మరణశిక్షను అమలు చేసింది.

అటు రినాష్ ఇంటి వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి.అతని తల్లి లైలా, ఆమె ఇద్దరు కుమారులు యూఏఈకి వెళ్లినట్లుగా తెలుస్తోంది.2023 ఫిబ్రవరిలో అల్ అయిన్‌లో యూఏఈ జాతీయుడిని హత్య చేసినందుకు రినాష్‌ను దోషిగా తేల్చింది కోర్ట్.రినాష్ కుటుంబం క్షమాభిక్ష కోసం భారత ప్రభుత్వం, యూఏఈ పాలకులకు వినతి పత్రాలు సమర్పించింది.కానీ మృతుడి కుటుంబం మాత్రం క్షమాపణలు పెట్టేందుకు ముందుకు రాకపోవడంతో వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి.







