భారత సంతతికి చెందిన 12 ఏళ్ల బాలిక ఆస్ట్రేలియాలో( Australia ) అరుదైన ఘనత సాధించింది.అతి పిన్న వయస్కురాలైన రచయిత్రిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ బాలిక గురువారం సిడ్నీలో ది వన్స్ టు వాచ్ ఏజ్ 7-15 విభాగంలో ప్రతిష్టాత్మకమైన న్యూసౌత్‌వేల్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్( New South Wales Woman of the Year ) అవార్డును అందుకుంది.
పంజాబ్‌లోని నవాన్‌షహర్ జిల్లాలోని బాలాచౌర్ తహసీల్‌లోని సజవల్‌పూర్ గ్రామానికి చెందిన కుటుంబంలో జన్మించింది ఆష్లీన్ ఖేలా.( Ashleen Khela )
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని( International Women’s Day ) పురస్కరించుకుని సిడ్నీలోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో న్యూ సౌత్ వేల్స్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో మహిళా మంత్రి జోడి హరిసన్ ఈ అవార్డును ఆష్లీన్ ఖేలాకు అందజేశారు.
ఆస్ట్రేలియా సహా ప్రపంచవ్యాప్తంగా పేద, నిర్లక్ష్యం చేయబడిన పిల్లల సంక్షేమానికి మద్ధతుగా ఆమె రాసిన రెండు పుస్తకాల అమ్మకం ద్వారా వచ్చిన మొత్తం ఆదాయాన్ని విరాళంగా ఇచ్చినందుకు ఆష్లీన్‌కు ఈ అవార్డ్ లభించింది.

ఆష్లీన్ తన తొలి పుస్తకం ప్రచురణకు అయ్యే ఖర్చులను 8 నుంచి 11 ఏళ్ల వయసులో సీసాలు, డబ్బాలను రీసైక్లింగ్ చేయడం, తోటపని చేయడం ద్వారా సంపాదించిందని ఆమె తండ్రి అమర్‌జిత్ ఖేలా తెలియజేశారు.న్యూసౌత్‌వేల్స్ గవర్నర్ మార్గరెట్ బీజ్లీ.అవార్డుల ప్రదానోత్సవం తర్వాత ఆష్లీన్‌ను సిడ్నీలోని గవర్నమెంట్ హౌస్‌కు టీ తాగడానికి ఆహ్వానించారు.
రచనల ద్వారా ఆష్లీన్ చేసిన దాతృత్వ కార్యక్రమాలను గవర్నర్ ప్రశంసించారు.

2019లో భారతదేశ పర్యటన సందర్భంగా పంజాబ్‌లో రోడ్డుపక్కన మురికివాడల్లో నివసిస్తున్న వలస కార్మికుల పిల్లలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఆష్లీన్ ఖేలా ఎనిమిదేళ్ల వయసులోనే రాయడం ప్రారంభించింది.ఆష్లీన్ తొలి పుస్తకం ‘‘17 స్టోరీస్’’ 2023లో ప్రచురించబడింది.తద్వారా ఆస్ట్రేలియాలో అతి పిన్న వయస్కురాలైన మహిళా రచయిత్రిగా ఆష్లీన్ ఘనత సాధించింది.
దీంతో ఆమెపై ఆస్ట్రేలియాలో స్థిరపడిన ప్రవాస భారతీయులు, మానవతావాదులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.







