తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు.రాష్ట్ర ప్రభుత్వంతో ఉన్న విభేదాలపై ఆమె స్పందించారు.
యూనివర్సిటీ రిక్రూట్ మెంట్ బిల్లును తొక్కిపెట్టినట్లుగా తనపై అసత్య ప్రచారం జరుగుతోందని గవర్నర్ తెలిపారు.రాష్ట్రంలో ఓ విధానం అమల్లో ఉన్నప్పుడు కొత్త తరహా విధానాన్ని ప్రభుత్వం తేవాలనుకుంటోందని చెప్పారు.
ఈ నేపథ్యంగానే తనకున్న అనుమానాలపై వివరణ కోరినట్లు వెల్లడించారు.బిల్లును సమగ్రంగా పరిశీలించేందుకే సమయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ప్రత్యేక రిక్రూట్ మెంట్ బోర్డు ఏర్పాటుపై మరిన్ని వివరాలు కావాలని అడిగానని తెలిపారు.
యూనివర్సిటీలే కేంద్రంగా రిక్రూట్ బోర్డు ఉంటుందా అని గవర్నర్ తమిళిసై ఈ సందర్భంగా ప్రశ్నించారు.
రిక్రూట్ మెంట్ అయిన తర్వాత న్యాయపరమైన వివాదాలు తలెత్తుతాయా అని అడిగారు.ప్రతీ ఏటా రిక్రూట్ మెంట్ నిర్వహిస్తారా? ఇలా ఎన్నో సందేహాలు లేవనెత్తానంటూ వెల్లడించారు.ఈ బిల్లు తన దగ్గరకు వచ్చి కేవలం నెల రోజులే అయిందని పేర్కొన్నారు.
ప్రభుత్వానికి రాజ్ భనవ్ నుంచి లేఖ పంపిస్తే రాలేదనడం ఆశ్చర్యం కలిగించిందని చెప్పారు.
ప్రగతిభవన్ నుంచి మంత్రికి లేఖ అందడంలో అంత ఆలస్యం జరిగితే ఇంకా రాష్ట్రంలో ప్రజల సంగతేంటని ఆమె ప్రశ్నించారు.