వినియోగదారుల హక్కులంటే చాలామందికి లెక్క ఉండదు.కానీ మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాకు చెందిన చక్రేష్ జైన్ ( Chakresh Jain )మాత్రం రూపాయిన్నర కోసం ఏకంగా ఏడేళ్లు పోరాటం చేసి అందరి దృష్టిని ఆకర్షించారు.
ఈ చిన్న మొత్తం వెనుక ఉన్న వినియోగదారుల హక్కుల పరిరక్షణే ఆయన ధ్యేయంగా నిలిచింది.ఓ గ్యాస్ ఏజెన్సీ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఆయన చేసిన సుదీర్ఘ పోరాటం ఎందరికో స్ఫూర్తినిచ్చింది.ఇంతకీ ఏం జరిగింది.
2017 నవంబర్ 14న చక్రేష్ జైన్ భారత్ గ్యాస్ ఏజెన్సీలో ( Bharat Gas Agency )గ్యాస్ సిలిండర్ బుక్ చేశారు.సిలిండర్ ధర రూ.753.50 కాగా, డెలివరీ బాయ్ వద్ద చిల్లర లేదని చెప్పి రూ.755 వసూలు చేశాడు.మిగిలిన రూపాయిన్నర తిరిగి ఇవ్వమని అడిగితే ఏజెన్సీని సంప్రదించమని చెప్పడంతో జైన్ కు కోపం నషాళానికి అంటింది.వెంటనే ఆయన నేరుగా ఏజెన్సీకి, జాతీయ వినియోగదారుల ఫోరమ్‌కు ఫిర్యాదు చేశారు.
తొలుత ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో 2019 జులై 15న సాగర్ జిల్లా వినియోగదారుల ఫోరమ్‌లో చక్రేష్ జైన్ కేసు వేశారు.గ్యాస్ ఏజెన్సీ ఈ విషయాన్ని చాలా తేలికగా తీసుకుంది.అంతేకాదు, జైన్‌ను ఎగతాళి చేసింది.అయినా జైన్ వెనక్కి తగ్గలేదు.తన న్యాయవాది రాజేష్ సింగ్ సహకారంతో న్యాయం కోసం పట్టుదలగా పోరాడారు.
సుమారు ఐదేళ్ల పాటు విచారణ జరిగిన తర్వాత వినియోగదారుల ఫోరమ్ సంచలన తీర్పునిచ్చింది.ఏజెన్సీ సేవలలో లోపం ఉందని స్పష్టంగా తేల్చింది.ఏజెన్సీ రెండు నెలల్లో రూపాయిన్నరను 6% వార్షిక వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని ఆదేశించింది.అంతేకాకుండా జైన్ అనుభవించిన మానసిక, ఆర్థిక ఇబ్బందులకు పరిహారంగా రూ.2,000, కోర్టు ఖర్చుల కోసం మరో రూ.2,000 చెల్లించాలని తీర్పునిచ్చింది.ఈ కేసు వినియోగదారుల హక్కుల ప్రాముఖ్యతను చాటి చెప్పింది.
చక్రేష్ జైన్ పోరాటం వ్యాపార సంస్థలకు ఒక హెచ్చరిక.వినియోగదారులను న్యాయంగా చూడాలని, నైతిక విలువలను పాటించాలని ఈ తీర్పు గుర్తు చేస్తుంది.“ఇది కేవలం రూపాయిన్నర కోసం కాదు, మా హక్కులు, ఆత్మగౌరవం కోసం చేసిన పోరాటం” అని జైన్ గర్వంగా చెప్పారు.