మునుగోడు రైతులకు సీఎం కేసీఆర్ కావాలో? మోడీ కావాలో? తేల్చుకోవాలని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు, ఏర్పడిన తర్వాత రైతుల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలని మంత్రి కేటీఆర్ కోరారు.
మునుగోలు ఎన్నికల నేపథ్యంలో తాజాగా మంత్రి కేటీఆర్ రైతులతో టెలి కాన్ఫరెన్స్ లో మాట్లాడారు.వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టి విద్యుత్ సరఫరాను మోడీ ప్రైవేటు పరం చేస్తున్నాడని కేటీఆర్ ఆరోపించారు.
అందుకే తెలంగాణలో రైతులకు ఉచితంగా అందిస్తున్న విద్యుత్‌ను రైతుల నుంచి దూరం చేసేందుకు కుట్ర చేస్తున్నారని విమర్శించారు.విద్యుత్ సరఫరా ప్రైవేటు పరమైతే రైతులు ఎన్నో కష్టాలు ఎదుర్కొవాల్సి వస్తుందన్నారు.
పెట్రోల్ ధరల మాదిరిగానే విద్యుత్ రేట్లు కూడా ఆకాశాన్నంటుతాయన్నారు.బీజేపీ అధికారంలోకి వస్తే రైతులు మందుగానే డబ్బులు చెల్లించి విద్యుత్ పొందాల్సిన పరిస్థితి నెలకొంటుందన్నారు.
అందుకే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెరాస ప్రభుత్వం పోరాటం చేస్తోందని కేటీఆర్ రైతులకు తెలిపారు.
ప్రభుత్వం అవలంభిస్తోన్న ధాన్య సేకరణ స్కీమ్‌ను కూడా కేంద్రం ప్రైవేటు కంపెనీలకు ఇచ్చేందుకు కుట్ర చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు.
ఇది ఇలాగే జరిగితే రైతులకు కనీస మద్దతు ధర కూడా లభించదన్నారు.గతంలో రాష్ట్రంలో విద్యుత్ వస్తే వార్తలా ప్రచారం అయ్యేది.కానీ ఇప్పుడు కరెంట్ పోతే వార్త అన్నట్లుగా తెలంగాణ అభివృద్ధి చెందిదన్నారు.రైతులకు ఉచితంగా విద్యుత్ అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా రూ.10,500 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు.

రైతులకు రైతుబంధు చెల్లించి వ్యవసాయాన్ని ప్రోత్సాహిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి కేటీఆర్ తెలిపారు.ప్రభుత్వం ఏటా సుమారు రూ.58 వేల కోట్లు రైతులకు పంట సాయం అందజేస్తుందన్నారు.అలాగే ప్రమాదవశాత్తు రైతులు చనిపోతే వారి కుటుంబానికి రూ.5 లక్షల రైతు బీమా సౌకర్యాన్ని కల్పించిందన్నారు.ఇప్పటివరకు 1.17 లక్ష కోట్ల రూపాయలతో ధాన్యం, ఇతర పంటలను కొనుగోలు చేసిన రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని కేటీఆర్ వెల్లడించారు.మునుగోడులో ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొట్టి ఇంటింటికీ మంచినీరు అందిస్తున్నామని, బీజేపీ అబద్ధపు ప్రచారానికి రైతులు లోను కావొద్దని కేటీఆర్ పేర్కొన్నారు.