యావత్ భారతీయ చిత్ర పరిశ్రమను, అభిమానులను విషాదంలోకి ముంచెత్తిన ఘటన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం.ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా హిందీ చిత్ర పరిశ్రమలో తనదైన స్థానం సంపాదించుకున్న ఆయన ఆకస్మిక మరణం నిజంగా దురదృష్టకరం.
వీటన్నింటిని పక్కనబెడితే ఆయన మరణం ఇప్పటికీ మిస్టరీయే.సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నారా.? లేక ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా.? అన్న ప్రశ్నలు ఇప్పటికీ వెంటాడుతూనే వున్నాయి.34 ఏళ్ల సుశాంత్ 2020 జూన్ 14న తన ఇంట్లోనే అనుమానాస్పద స్థతిలో శవమై కనిపించారు.మొదట్లో ఇది ఆత్మహత్య అంటూ రిపోర్టులు వచ్చాయి.
కానీ, రోజులు గడుస్తున్నకొద్దీ ఈ కేసు అనేక మలుపులు తిరిగింది.అన్నింటికి మించి ఈ కేసులో డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చి టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు షేక్ చేసింది.
ఇప్పటికీ ఈ కేసులో ఎన్సీబీ ముమ్మరంగా విచారణ చేస్తోంది.సుశాంత్ మాజీ ప్రేయసీ రియా చక్రవర్తి అరెస్ట్ కావడంతో పాటు కొన్నాళ్లు జైల్లో కూడా వుంది.ముంబై పోలీస్, బిహార్ పోలీస్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ), ఎంఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాయి.ముఖ్యంగా సుశాంత్ సింగ్ చావు హత్యా, ఆత్మహత్యా అనే విషయాన్ని సీబీఐ దర్యాప్తు చేస్తోంది.
సుప్రీంకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించి నెలలు గడుస్తున్నా…పరిశోధనా ఫలితాలను మాత్రం ఆ సంస్థ ఇప్పటివరకూ వెల్లడించలేదు.
కాగా.ఈ కేసులో కీలక సాక్ష్యాధారాల సేకరణలో సాయం చేయాలని సీబీఐ.అమెరికాను కోరినట్లుగా కథనాలు వస్తున్నాయి.
సుశాంత్ సింగ్ ఈ-మెయిల్, సోషల్ మీడియా ఖాతాల్లో డిలిటెడ్ డేటా తిరిగి పొందడానికి సాయం చేయాలని అమెరికాను సీబీఐ కోరిందన్నది ఆ వార్తల సారాంశం.డేటా రికవరీ చేయడానికి అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న దిగ్గజ సంస్థలు గూగుల్, ఫేస్‌బుక్ యాజమాన్యాలకు ఇదే తరహాలో సీబీఐ రిక్వెస్ట్‌లు పంపినట్లు సమాచారం.
అమెరికా-భారత ప్రభుత్వాల మధ్య పరస్పర న్యాయ సహాయ ఒప్పందం (ఎంఎల్ఏటీ) వుంది.దీని కింద రెండు దేశాలు తమ అంతర్గత కేసుల దర్యాప్తులో పరస్పరం సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవచ్చు.
గూగుల్ జీ-మెయిల్, ఫేస్‌బుక్ ఖాతాల్లో తొలగించిన డేటా ద్వారా సుశాంత్‌సింగ్ మరణానికి దారి తీసిన అంశానికి సంబంధించి ఏదైనా ఆధారం దొరికే అవకాశం వుందని సీబీఐ భావిస్తోంది.మరి సీబీఐ యత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో వేచి చూడాలి.