భారతదేశంలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.ఏడాది సమయంలోనే పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు పేదవాడికి అందనంత ఎత్తుకు చేరుకున్నాయి.
పెరుగుతున్న ధరలతో కుటుంబ పోషణ భారమై పేద, మధ్యతరగతి ప్రజలు లబోదిబోమంటున్నారు.ఈ నేపథ్యంలో ఒక బ్యాడ్ న్యూస్ వెలుగు చూసింది.
అదేంటంటే చమురు సంస్థలు వంటగ్యాస్‌పై మరో వంద రూపాయలు వడ్డించడానికి రెడీ అయ్యాయి.చమురు సంస్థల నిర్ణయానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే.వినియోగదారులు ఒక్కో సిలిండర్‌కు రూ.100 ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది.
అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర పెరుగుతుండగా ఆ భారం తమపై పడుతున్నట్టు ఆయిల్ కంపెనీలు పేర్కొంటున్నాయి.ఆ నష్టాలను తగ్గించుకునేందుకు చమురు సంస్థలు వంద రూపాయల భారం వినియోగదారులపై మోపాలని నిర్ణయించాయి.
అయితే ఎంత పెంచాలి? వినియోగదారుడికి ఆ భారాన్ని బదిలీ చేయాలా లేదా అనేది ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంది.

ఇదిలా ఉండగా అక్టోబర్ 6వ తేదీన చమురు సంస్థలు ఒక్కో వంటగ్యాస్ సిలిండర్‌కు 15 రూపాయలు పెంచేశాయి.నాలుగు నెలల్లోనే వంట గ్యాస్ ధర 90 రూపాయలు పెరగడం గమనార్హం.ఇక గతేడాది నుంచే కేంద్రం ఎల్పీజీపై రాయితీలు తొలగించింది.
అయితే పెట్రోల్, డీజిల్ మాదిరి ఎల్పీజీ ధరపై నియంత్రణ తొలగిస్తున్నట్లు భారత ప్రభుత్వం లాంఛనంగా ప్రకటించలేదు.అలాగే కొండ ఎక్కుతున్న వంటగ్యాస్ ధరల భారాన్ని తగ్గిస్తామని కేంద్రం ఇప్పటి వరకు ఎలాంటి హామీ ఇవ్వలేదు.
ఒకవేళ ఇప్పుడు కూడా ఈ భారాన్ని భరించేందుకు కేంద్రం ముందుకు రాకపోతే మళ్లీ గ్యాస్ ధరలు భగ్గుమనే అవకాశం ఉంది.ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 85 డాలర్లకు పైగా కొనసాగుతోంది.
అలాగే పెట్రోల్ ధర కూడా పెరుగుతోంది.దాంతో పెట్రోల్ డీజిల్ మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.