వరుస వరుస ఉద్యమాలతో ఏపీ లో గ్రాఫ్ పెంచుకునేందుకు జనసేన ప్రయత్నాలు చేస్తోంది. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ బలహీనం అయ్యిందనే సంకేతాలతో పవన్ ఏపీలో జనసేన ను యాక్టిివ్ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
ఇప్పటికే రోడ్ల పరిస్థితి పై పెద్ద ఎత్తున జనసేన ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది.ఊహించిన స్థాయిలో రెస్పాన్స్ కనిపించింది.
గ్రామ, మండల, జిల్లా , రాష్ట్ర స్థాయిలో జనసైనికులు రోడ్ల ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు .ఊహించని విధంగా వచ్చిన ఈ క్రెడిట్ తో జనసేన మైలేజ్ పెరగడం ఇవన్నీ లెక్కలు వేసుకున్న జనసేన మరో ఉద్యమానికి సిద్ధం అవుతోంది. ఏపీలో సంచలనం సృష్టించిన విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంలో పోరాటం చేసేందుకు ప్లాన్ చేసుకుంటుంది.ఈ మేరకు ఈ రోజు విశాఖ జిల్లాలో పర్యటించిన ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈ అంశంపై స్పందించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని, ప్రైవేటీకరణ అంశానికి వ్యతిరేకంగా వచ్చే నెలలో విశాఖలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొంటారని, ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో ఈ అంశంపై పవన్ చర్చలు జరిపారని మనోహర్ వ్యాఖ్యానించారు.అసలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం లో మొట్టమొదటిగా స్పందించింది పవన్ అంటూ మనోహర్ స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేసే విషయంపై కేంద్ర అధికార పార్టీ బిజెపి చాలా క్లారిటీ తో ఉంది.
ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ విషయంలో వెనక్కి తగ్గేది లేదంటూ ఇప్పటికే అనేక మంది కేంద్ర మంత్రులు ప్రకటన చేశారు.ఈ పరిస్థితుల్లో పవన్ కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా గళం విప్పేందుకు సిద్దమవుతుండటంతో బీజేపీతో ఇక తాడోపేడో తేల్చుకునేందుకు డిసైడ్ అయ్యారని ,ఏపీలో ఆ పార్టీతో పొత్తు సైతం రద్దు చేసుకునే ఆలోచనలో ఉన్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
.