ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో మణిశర్మ, కీరవాణి, దేవి శ్రీ ప్రసాద్ ఎక్కువ సంఖ్యలో మూవీ ఆఫర్లతో బిజీగా ఉండేవారు.అయితే థమన్ ఎంట్రీ తరువాత ఇతర మ్యూజిక్ డైరెక్టర్లతో పోలిస్తే థమన్ కే ఎక్కువగా ఆఫర్లు వస్తున్నాయి.
థమన్ తన సినిమాల్లో ఎంతోమంది సింగర్లకు అవకాశం ఇస్తూ వాళ్లను ప్రోత్సహిస్తున్నారు.గతంలో థమన్ మ్యూజిక్ పై విమర్శలు వచ్చినా మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తూ ప్రస్తుతం థమన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.
గత కొన్నేళ్లలో థమన్ మ్యూజిక్ అందించిన సినిమాల్లోని పాటలు అద్భుతంగా ఉన్నాయని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపించాయి.థమన్ సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చాడనే సంగతి తెలిసిందే.
థమన్ తల్లికి సినిమాల్లో పాటలు పాడాలనే కోరిక ఉన్నప్పటికీ థమన్ మాత్రం తన తల్లికి ఇప్పటివరకు సినిమా ఆఫర్ ఇవ్వలేదు.తన తల్లికి ఛాన్స్ ఇవ్వకపోవడం గురించి థమన్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నాన్న చనిపోయిన తర్వాత అమ్మ బాధ్యతలను తానే తీసుకున్నానని థమన్ చెప్పుకొచ్చారు.
తను మ్యూజిక్ అందించే సినిమాలలో పాడాలని అమ్మ అనుకుంటున్నారని థమన్ వెల్లడించారు.తన భార్య శ్రీ వర్ధిని ఇప్పటికే కొన్ని సినిమాల్లో పాటలు పాడారని విశాల్ హీరోగా తెరకెక్కబోయే సినిమాలో కూడా తన భార్య పాట పాడబోతుందని థమన్ చెప్పుకొచ్చారు.తన తల్లికి కూడా పాట పాడే అవకాశం ఇస్తే కుటుంబ సభ్యులకే సినిమా ఆఫర్లు ఇస్తున్నానని కామెంట్లు వస్తాయని భావిస్తున్నానని థమన్ అన్నారు.
సర్కారు వారి పాట, భీమ్లా నాయక్ సినిమాలతో పాటు అఖండ, గాడ్ ఫాదర్, శంకర్ చరణ్ కాంబో మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు.మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీకి కూడా థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.థమన్ తన తరువాత సినిమాల్లో అయినా తల్లికి ఛాన్స్ ఇస్తారేమో చూడాల్సి ఉంది.