అమెరికాలో న్యూయార్క్(New York in America) తర్వాత పెద్ద నగరంగా, హాలీవుడ్‌కు(Hollywood) రాజధానిగా ఉన్న లాస్ ఏంజెల్స్(Los Angeles) నగరం ఇప్పుడు బూడిద కుప్పగా మారిన సంగతి తెలిసిందే.కార్చిచ్చు దాటికి లక్షల కోట్ల ఆస్తి నష్టం వాటిల్లగా.
పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.ఇక హాలీవుడ్ సెలబ్రెటీల ఇళ్లు కూడా అగ్నికి ఆహుతవ్వడంతో వాళ్లంతా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు.
కార్చిచ్చు సద్దుమణిగిందని భావించిన వారికి మరోసారి షాక్ తగిలింది.
బుధవారం.
ఉత్తర లాస్ ఏంజెల్స్‌లో (North Los Angeles)మరో కార్చిచ్చు రేగింది.కాస్టాయిక్ లేక్ సమీపంలో చెలరేగిన మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు వేగంగా వ్యాపించాయి.
కొద్దిగంటల్లోనే 8 వేల ఎకరాల విస్తీర్ణం మేర తగలబడిపోయింది.దీంతో అప్రమత్తమైన అధికారులు శాంటా క్లారా నగరంలోని 31 వేల మంది ప్రజలను హుటాహుటిన ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
అయితే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక జనం బిక్కుబిక్కుమంటున్నారు.ఆ ప్రాంతంలో వరుసపెట్టి కార్చిచ్చు చెలరేగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
ఇది మరింత వేగంగా విస్తరించడంతో తక్షణమే ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లాలని లాస్ ఏంజెలెస్ కౌంటీ షరీఫ్ విభాగం ప్రకటించింది.

కార్చిచ్చు కారణంగా జైళ్లలోని ఖైదీలను కూడా అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.అలాగే అమెరికా పశ్చిమ తీరంలోని(West Coast of America) ఎక్స్‌ప్రెస్ వేలోని కొంత భాగాన్ని మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.కార్చిచ్చు రేగిన ప్రాంతాలలో విమానాలు, హెలికాఫ్టర్ల ద్వారా మంటలను అదుపు చేస్తున్నారు.
ఇదిలాఉండగా.కార్చిచ్చు కారణంగా సర్వం కోల్పోయిన వారికి అమెరికాలోని సిక్కు సంస్థలు ఆపన్న హస్తం అందిస్తున్నాయి.
అగ్ని ప్రభావిత ప్రాంతాల్లో వేలాది మందికి ఉచిత భోజనం, నిత్యావసర వస్తువులను అందిస్తున్నాయి.లెట్స్ షేర్ ఏ మీల్ సంస్థకు చెందిన ఓంకార్ సింగ్ మాట్లాడుతూ.
సిక్కు మత వ్యవస్ధాపకుడు గురునానక్ బోధనల నుంచి ప్రేరణ పొందిన తాము ఆపదలో ఉన్న వారికి సాయం చేస్తున్నట్లు తెలిపారు.

లాస్ ఏంజెల్స్ అగ్నిప్రమాదంలో బాధితులకు ఆహారంతో పాటు, బేబీ ఫుడ్ , బట్టలు వంటి నిత్యావసర వస్తువులను అందిస్తున్నారు.కొంతమంది ఆశ్రయం కోసం ఎదురుచూస్తున్నారని ఓంకార్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.12 ఏళ్ల క్రితం న్యూజెర్సీలో లెట్స్ షేర్ ఏ మీల్ స్థాపించగా.అమెరికా అంతటా ఇప్పటి వరకు 10 లక్షలకు పైగా భోజనాలను అందించింది.







