ఎట్టకేలకు నేడు ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ఖరారైంది.మధ్యాహ్నం కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తో జగన్ భేటీ కాబోతున్నారు.
అలాగే వివిధ శాఖల మంత్రులను కలిసి ఏపీ కి సంబంధించిన అనేక సమస్యల పైన జగన్ చర్చించనున్నారు.రెండు రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేయబోతున్న జగన్ ఈ సందర్భంగా ఏపీ కి సంబంధించిన అన్ని విషయాల పైన బిజెపి పెద్దలతో చర్చించే అవకాశం కనిపిస్తోంది.
ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టును ఈ డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని వైసీపీ ప్రభుత్వం ప్రకటించడంతో , దానికి సంబంధించిన కొన్ని ఇబ్బందులు, నిధుల సమస్య తదితర అంశాలపై ప్రధానంగా జగన్ చర్చిస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నా, అసలు విషయం మాత్రం వేరే ఉందని, తమకు అదేపనిగా ఇబ్బందికరంగా మారిన నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారాన్ని జగన్ తన పర్యటన ముగించి లోపు తేల్చేస్తారా అని, ఆయన కారణంగా తాము ఎంత ఇబ్బంది పడుతున్నామనే విషయాన్ని ఢిల్లీ పెద్దలకు జగన్ చెప్పబోతున్నారు.
అదీ కాకుండా రాజద్రోహం కేసు పైన, సీబీఐ అధికారులు ఆయనను అరెస్టు చేసిన తర్వాత , అంతకుముందు జరిగిన అన్ని వ్యవహారాలను జగన్ అమిత్ షా కు వివరించి స్పష్టమైన హామీ తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
రాజద్రోహం కేసు ను పూర్తిగా తొలగించాలని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, గవర్నర్లకు ఎంపీలకు రామకృష్ణంరాజు లేఖలు రాస్తున్నారు . ఇప్పటికే కేంద్ర బిజెపి ప్రభుత్వం అనేక రాష్ట్రాల్లో అనేక మంది ఇదే రాజద్రోహం కేసు అస్త్రాన్ని ఉపయోగించడం తదితర కారణాలతో దీనిని తొలగించే అవకాశం ఉండదని, అది కాకుండా దీని గురించి హడావుడి చేస్తున్న రఘురామకృష్ణంరాజు వ్యవహారం పై బిజెపి పెద్దలు గుర్రుగా ఉన్నారనే సమాచారం తో జగన్ సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించాలి అనే ఆలోచనలో ఉన్నారట.అదీ కాకుండా తాము ఆపద సమయంలో బిజెపి ప్రభుత్వానికి అండగా నిలబడుతున్నామని, కానీ ఒక్క ఎంపీ కోసం తమను దూరం చేసుకోవద్దు అనే విషయాన్ని జగన్ అమిత్ షా కు చెప్పబోతున్నారట.
ఇప్పుడే కాదు భవిష్యత్తులో ను తమ ప్రభుత్వం, ఎంపీలు అన్ని విధాలుగా సహకారం అందిస్తారని, ఏపీ ప్రయోజనాల విషయంలో కేంద్రం అంతే స్థాయిలో సహకరించాలని, అలాగే రఘురామకృష్ణంరాజు ను పూర్తిగా కట్టడి చేయాలనే ప్రధాన డిమాండ్ తో జగన్ అమిత్ షాను కలవబోతున్న ట్లు విశ్వసనీయ సమాచారం .అలాగే రఘురామకృష్ణంరాజు బ్యాంకులను మోసం చేసిన కేసుల పైన విచారణ చేయించాలని జగన్ కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.జగన్ సూచనలు అభ్యర్థనలను కేంద్రం పరిగణలోకి తీసుకుంటే రఘురామకృష్ణంరాజు వ్యవహారానికి పులిస్టాప్ పడినట్లే.