ప్రధాన ప్రతిపక్షంగా ఏపీ లో ఉన్న తెలుగుదేశం పార్టీ రాజకీయ ఉనికి కోసం గట్టిగానే ఆరాటపడుతోంది.ఒక వైపు బలంగా ఉన్న వైసీపీ ని కొట్టి అధికారం దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే, మరోపక్క బిజెపి వంటి పార్టీలతో పొత్తు పెట్టుకుని బలపడే విధంగా అడుగులు వేస్తోంది.
మరీ ముఖ్యంగా చెప్పుకుంటే లోకేష్ నాయకత్వాన్ని టిడిపిలో బలపరచడమే కాకుండా, ఆయనకు పార్టీలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసేందుకు చంద్రబాబు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.కాకపోతే లోకేష్ పనితీరుపై పార్టీ నేతల్లోనే పెద్దగా సదభిప్రాయం లేదు.
లోకేష్ అసమర్థుడని , ఆయనను పార్టీ నెత్తిన రుద్ది మరింతగా పార్టీ పరిస్థితిని దిగజారుస్తున్నారు అనే అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంది.
ఈ విషయం బాబుకు సైతం అర్థం అయింది.
మరీ ముఖ్యంగా పార్టీ సీనియర్ నాయకులు లోకేష్ నాయకత్వాన్ని ఒప్పుకోవడం లేదని, తమకంటే జూనియర్ అయిన లోకేష్ కు రాజకీయ పరిజ్ఞానం లేదని, అటువంటి వారి నాయకత్వంలో తాము పని చేయడం తమకు అవమానమే అన్నట్లుగా పార్టీ సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నట్లు బాబు గ్రహించారు.అందుకే సీనియర్ నాయకుల హవాను పార్టీలో పూర్తిగా తగ్గించి, యువ నాయకత్వాన్ని ఎక్కువగా ప్రోత్సహించి లోకేష్ కు రాజకీయ ఇబ్బందులు లేకుండా చేయాలని చూస్తున్నారు.
జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కుంటుందో ఇప్పుడు తమ పార్టీ అదే ఇబ్బందులు ఎదుర్కొంటుంది అనే విషయాన్ని బాబు గుర్తించారు.
కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుల ప్రభావం ఎక్కువ అని, అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని,

వారంతా రాహుల్ నాయకత్వంలో పని చేసే విషయంలో విముఖత చూపిస్తున్నారు అని, అలాగే సీనియర్ నాయకులకు ప్రజల్లో బలం లేకపోయినా, వారి పనితీరు పై ప్రజల్లో అంత సానుకూలత లేదు అని, దీంతో కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పునర్వైభవం రావాలి అంటే , తప్పనిసరిగా జాతీయ స్థాయిలో యువ నాయకత్వాన్ని ఎక్కువగా ప్రోత్సహించాలని రాహుల్ భావిస్తున్నారు.ఇప్పుడు అదే విధంగా టిడిపిలోనూ యువ నాయకత్వాన్ని ప్రోత్సహించి సీనియర్లను ఎటువంటి మొహమాటం లేకుండా పక్కన పెట్టాలని బాబు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.త్వరలోనే ఈ మేరకు కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు బాబు సిద్ధం అవుతున్నట్లుగా పరిస్థితి కనిపిస్తోంది.