భారత సంతతికి చెందిన న్యాయ కోవిదుడు, మేథో సంపత్తి నిపుణుడు దేదర్ సింగ్ గిల్ సోమవారం సింగపూర్ సిటీ- స్టేట్ హైకోర్టుకు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు.సింగపూర్ దేశాధ్యక్షురాలు హలిమా యాకోబ్ సమక్షంలో గిల్ ప్రమాణం చేశారు.61 ఏళ్ల గిల్, మొదట సుప్రీంకోర్టు బెంచ్‌లో 2018 ఆగస్టులో చేరారు.అక్కడ ఆయనను జ్యూడీషియల్ కమీషనర్‌గా నియమితులయ్యారు.
సింగపూర్ చట్టసభలలో ఎంతో ఉన్నతమైన పదవులు అధిరోహించిన గిల్ ప్రభుత్వానికి ఎంతో నమ్మకస్తుడిగా పేరు సంపాదించుకున్నారు.
జ్యూడీషియల్ కమీషనర్‌గా చేరకముందు ఆయన డ్రూ మరియు నేపియర్ వద్ద మేధో సంపత్తి విభాగం మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు.
ఈ సంస్థ కోసం పనిచేస్తున్నప్పుడు, గిల్ తమ కార్పోరేట్ క్లయింట్ల కోసం హైకోర్ట్‌తో పాటు కోర్ట్ ఆఫ్ అప్పీల్ ముందు న్యాయవాదిగా హాజరయ్యేవారు.అంతేకాకుండా మేథో సంపత్తి చట్టంలో తన ప్రతిభతో ఖ్యాతిని పొందారు.
ఈ క్రమంలో గిల్‌ను హైకోర్టు యొక్క మేథో సంపత్తి జాబితాను నిర్వహించేందుకు గాను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సుందరేశ్ మీనన్ నియమించారు.విధి నిర్వహణలో భాగంగా దేదర్ సింగపూర్‌లోని మేథో సంపత్తి పరిష్కార వ్యవస్థను సమీక్షించే పనిలో ఉన్నారు.

మేథో సంపత్తి కేసులతో పాటు కాంట్రాక్ట్, హింస, నిర్లక్ష్యం తదితర విషయాలకు సంబంధించిన కేసులలో గిల్‌కు అపారమైన అనుభవం వుంది.సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ నుంచి దేదర్ సింగ్ గిల్ 1983లో బ్యాచిలర్ లా విత్ ఆనర్స్‌లో పట్టా పొందారు.గిల్ నియామకంతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 25కి చేరింది.వీరిలో నలుగురు జ్యూడీషియల్ కమీషనర్లు, నలుగురు సీనియర్ న్యాయమూర్తులు, 17 మంది అంతర్జాతీయ న్యాయమూర్తులు ఉంటారు.ఉన్నతమైన హోదాలో వున్న గిల్ సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకి ఎంతో దగ్గరగా ఉండేవారని అక్కడి మీడియా కొనియాడింది.