కంటికి కనిపించని సూక్ష్మజీవి భయంతో మనిషి నాలుగు గోడలకే పరిమితమయ్యాడు.ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల వ్యవస్థలు కరోనా కారణంగా స్తంభించిపోయాయి.
ఏ పనైనా సరే ఇంటి నుంచే చేయాల్సిన పరిస్ధితి.ప్రతిరోజూ నలుగురితో కలివిడిగా, సరదాగా గడిపేవారు ఒంటరితనంతో కుమిలిపోతున్నారు.
ఇక అయినవారిని వదిలిపెట్టి ఖండాలు దాటి వచ్చిన వారి ఆవేదన వర్ణనాతీతం.
ఈ నేపథ్యంలో అమెరికాలో చిక్కుకున్న భారతీయ విద్యార్ధుల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్.
అమెరికాలోని భారత రాయబార కార్యాలయం స్టూడెంట్ హబ్ గత శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె పాల్గొన్నారు.యూట్యూబ్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ తదితర మాధ్యమాల ద్వారా 84,000 మంది విద్యార్ధులు ఈ కార్యక్రమాన్ని వీక్షించారు.

ఈ సందర్భంగా సునీతా మాట్లాడుతూ.కరోనా ప్రభావంతో ఎటూ కదల్లేని ఈ పరిస్ధితిని ఉపయోగించుకునే ఇంటివద్దే ఉండి ఏ విధంగా క్రియాశీలకం కావొచ్చు అని ఆలోచించాలని సూచించారు.సమాజానికి ఏ విధంగా అదనంగా అందించగలుగుతామో ఆలోచించాలని సునీతా సలహా ఇచ్చారు.ఇదే సమయంలో అంతరిక్షంలో 322 రోజుల పాటు తాను గడిపిన అనుభవాన్ని ప్రస్తుత పరిస్ధితికి అన్వయించారు.
ఒంటరితనం కూడా ప్రభావితం కావడానికి వీలు కల్పిస్తుందని విద్యార్ధుల్లో ధైర్యాన్ని నింపారు.మరో వ్యోమగామికి శిక్షణను ఇస్తూ హ్యూస్టన్‌లోని తన వంటగది నుంచి సునీత ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం.