కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సినిమా ఇండస్ట్రీ మూతపడింది.ఈ మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉండటంతో షూటింగ్లను ఎక్కడికక్కడే నిలిపివేశారు.
ఇక సినిమా రిలీజ్లను కూడా ఆపేశారు.దీంతో సినీ రంగం తీవ్ర నష్టాల్లోకి వెళ్లడం ఖాయమని అంటున్నారు విశ్లేషకులు.
కాగా తమ సినిమాలను రిలీజ్ చేసి లాభాలు గడించాలని చూసిన నిర్మాతలు కూడా కరోనా దెబ్బకు నష్టాలు తప్పేలా లేవు.ఇప్పటికే రిలీజ్ కావాల్సిన సినిమాలు వాయిదా పడ్డాయి.
ఇక లాక్డౌన్ ముందు వారం రిలీజ్ అయిన సినిమాల పరిస్థితి చెప్పక్కర్లేదు.అసలే పరీక్షల సమయం కావడంతో కలెక్షన్లు లేక నీరసించిన సినిమాలకు లాక్డౌన్ పెద్ద దెబ్బ వేసిందని చెప్పొచ్చు.
అయితే ఈ లాక్డౌన్ ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు.దీంతో టాలీవుడ్ నిర్మాతలు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
మార్చి, ఏప్రిల్ నెలలో రిలీజ్ కావాల్సిన సినిమాలను డిజిటల్ ప్లాట్ఫాంలైన అమెజాన్, నెట్ఫ్లిక్స్, ఆహా లాంటి ఇతర ఓటీటీలపై నేరుగా రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారట.ఈ మేరకు త్వరలో అధికారికంగా ప్రకటన చేయనున్నట్లు సినీ వర్గాల టాక్.