ఏది ఏమైతేనేం జగన్ తో స్నేహం చేసేందుకు కేంద్ర బీజేపీ పెద్దలు సిద్ధమై పోయారు.ఏపీలో జగన్ తీసుకున్న ప్రతి నిర్ణయానికి వెనక ముందు చూడకుండా ప్రధాని మోదీ అంగీకారం తెలిపారు.
ఇక భవిష్యత్తులోనూ జగన్ ప్రభుత్వానికి అన్ని రకాలుగా అండగా ఉంటామని ప్రకటించేశారు.అంతేకాకుండా ఏ పని మీద జగన్ ఢిల్లీ వచ్చినా వెంటనే అన్ని పనులు చేయడం తో పాటు, అడిగిన నిధులను వెంటనే విడుదల చేయాల్సిందిగా ప్రధానమంత్రి కార్యాలయ అధికారులు సంబంధిత శాఖల మంత్రులకు, ఆయా శాఖాధిపతులకు అప్పుడే సమాచారం కూడా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
ఇంత వరకు బాగానే ఉన్నా కొద్దిరోజుల క్రితమే జగన్ పై పోరాటం చేసేందుకు తన శక్తి సరిపోవడం లేదనే ఉద్దేశంతో బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు చర్చగా మారింది.
ఇప్పటికే బీజేపీతో పొత్తు పెట్టుకుని రాజకీయంగా తప్పటడుగు వేసానన్న భావనలో పవన్ ఉన్నారు.అమరావతి విషయంలో కలిసి పోరాటం చేద్దాం అని చెప్పినా బీజేపీ వెనుకడుగు వేయడం, ఏపీ ప్రభుత్వంపై పోరాటం చేసే విషయంలో బిజెపి వెనక్కి తగ్గడం, ఇవన్నీ పవన్ కు మింగుడుపడని అంశాలుగా ఉన్నాయి.ఇప్పుడు సాక్షాత్తూ ప్రధానమంత్రి మోదీ జగన్ కు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తాను, అని తమ మద్దతు మీకు ఎప్పుడూ ఉంటుందని ప్రకటించడం పవన్ కు మింగుడుపడడంలేదు.
ఇక బీజేపీ కూడా జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా ఏపీలో బలపడవచ్చని భావించినప్పటికీ జగన్ పై పెరిగే వ్యతిరేకత ప్రభావం బిజెపి వైపు కంటే చంద్రబాబు వైపే ఎక్కువ వెళుతుందని ముందుగానే బీజేపీ పెద్దలు గ్రహించడంతో తో వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది.
అలా కాకుండా ముందుకు వెళ్తే ఏపీలో కాంగ్రెస్ కు పట్టిన గతే తమకు కూడా పడుతుందనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ను దూరం పెట్టి మరి జగన్ కు అకస్మాత్తుగా అపాయింట్మెంట్ ఇచ్చి ఢిల్లీ పిలిపించుకుని మరీ తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు.ఇప్పుడు పవన్ బీజేపీతో పొత్తు తెగతెంపులు చేసుకోలేక, అటు జగన్ కు మద్దతు పలకలేక ఇబ్బందికర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.అసలు ఈ విషయంపై తన స్పందన తెలియజేసేందుకు పవన్ ఏ మాత్రం ఇష్టపడడంలేదని తెలుస్తోంది.
ఇక ముందు ముందు కూడా ఆ విధంగానే సైలెంట్ గా ఉంటారో లేక బీజేపీతో తెగతెంపులు చేసుకుని ఏపీ ప్రతిపక్ష పార్టీగా ఉన్న టిడిపి తో జతకట్టి జగన్ ప్రభుత్వం పై పోరాటం చేస్తారో చూడాలి.ఏమైనా బిజెపి జగన్ కు దగ్గర ఇవ్వడం ద్వారా జనసేన పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టేసిందనే చెప్పుకోవాలి.