ఎన్నికలు వస్తున్నాయి అంటే పార్టీల్లో ఎక్కడ లేని హడావుడి కనిపిస్తుంది.పార్టీ అధిష్టానం నుంచి టికెట్ హామీ సంపాదించుకునేందుకు నేతలు పడరాని పాట్లు పడుతుంటారు.
అందుకోసం ఎంత ఖర్చు అయినా పెట్టేందుకు వెనుకాడరు.ప్రతి పార్టీలోనూ ఇది సర్వ సాధారణంగానే ఉండే తతంగమే.
అయితే ఇప్పుడు ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీలో మాత్రం సీన్ రివర్స్ లో ఉంది.ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్యెల్యేలకు జగన్ సీటు హామీ ఇస్తుండడంతో వారు వణికిపోతున్నారు.
మళ్ళీ మేమె ఎన్నికల్లో నిలబడాలా అంటూ నిట్టూరుస్తున్నారు.ఇంతకీ ఎందుకు ఇలా అంటున్నారు.
దీనికి కారణం ఏంటి అనే అనేక ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం చూద్దాం.
వైఎస్సార్ కడప జిల్లాలో వైసీపీ నాయకులు ఢీలాగా కనిపిస్తున్నారు.
సిట్టింగ్ ఎమ్మెల్యేలు అయితే వణికిపోతున్నారు.! వాస్తవానికి కడప జిల్లాకు సంబంధించినంత వరకు వచ్చే ఎన్నికల్లో సిట్టింగులకే మళ్లీ టికెట్లు ఇస్తానని జగన్ ప్రకటించారు.
ఈ ప్రకటన విని ఎగిరి గంతేయాల్సిన ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారట! వామ్మో… మళ్లీ నాకే టికెట్ ఇస్తారా అంటూ ఆందోళన చెందుతున్నారు.
వైఎస్ కుటుంబానికి కంచుకోట అయిన ఈ జిల్లాలో ఆ పార్టీకి ఇంత దుస్థితి రావడానికి కారణం డబ్బులు.ఎన్నికల ఖర్చును తల్చుకుని నాయకులు వణికిపోతున్నారు.గత ఎన్నికల్లోనే భారీగా అప్పులు చేసి ఎన్నికల బరిలో దిగామని.
భారీగా ఖర్చు పెట్టామని.గెలిచిన సంబరం పట్టుమని పదినెలలు కూడా లేదని వైసీపీ ఎమ్మెల్యేలు చెప్పుకొస్తున్నారు.
తమ పార్టీ అధికారంలోకి రాకపోవడంతో ఎన్నికల్లో పెట్టిన ఖర్చులో పదో వంతు కూడా సంపాదించుకోలేకపోయామని, ఇక మళ్ళీ అంత భారీ సొమ్ము ఎలా ఖర్చుపెట్టాలని వారు తమ సన్నిహితుల దగ్గర వాపోతున్నారు.
గత ఎన్నికలకు చేసిన అప్పులే పీకకు చుట్టుకుని ఉన్నాయని, ఇక మళ్లీ టికెట్ ఇస్తే ఎన్నికల ఖర్చులకు మొత్తం ఆస్తులన్నీ అమ్ముకోవాలని అంటున్నారట! ఒకవేళ మళ్లీ అప్పులు చేసి బరిలో దిగినా.
తమ ప్రభుత్వం వస్తుందన్న గ్యారంటీ లేదని సన్నిహితుల దగ్గర చెప్పుకుని బాధపడుతున్నారట! కడప జిల్లాలో ఉన్న మొత్తం పది అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒక్క రాజంపేట నుంచి మాత్రమే టీడీపీ గెలుచుకుంది.మిగిలిన తొమ్మిది నియోజకవర్గాలలో వైసీపీ గెలిచింది.
అందులో ఇద్దరు టీడీపీలోకి ఫిరాయించారు.ఇప్పుడు కడప జిల్లాలో కూడా తెలుగుదేశంపార్టీ బాగా పుంజుకుంది.
అందుకే ఇప్పుడు వైసీపీ సిట్టింగ్ ఎమ్యెలు భయపడుతున్నారు.