ఆంధ్రప్రదేశ్ శాసనసభ సాధారణ ఎన్నికలకు పదహారు నెలల సమయం ఉండగానే అధికార, ప్రతిపక్ష పార్టీల ప్రచారం ఎన్నికల సంగ్రామాన్ని తలదన్నే విధంగా ఉంది.తమ మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలలో 98 శాతం ఇప్పటికే నెరవేర్చానని, అలాగే హామీ ఇవ్వని అనేక పథకాలు ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చాను కనుక తనకు మరో అవకాశం కల్పించమని అధికార వై.
యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలను కోరుతున్నారు.తనకు ఇవే చివరి ఎన్నికలు కనుక లాస్ట్ చాన్స్ ఇవ్వమని ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జగన్ మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం అన్ని రంగాలలో వైఫల్యం చెందింది కనుక తనకు ఒక్క చాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని బాగుచేస్తానని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ లు ప్రజలకు విజ్ఞప్తి చేసున్నారు.వై.యస్.జగన్ మోహన్ రెడ్డి , నారా చంద్రబాబు నాయుడు ల విజ్ఞప్తి లపై ఎప్పుడు ఎలా స్పందించాలో ప్రజలకు స్పుష్టంగా తెలుసు.జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేస్తున్న ఒక్క చాన్స్ పైనే ప్రజలలో అనేక సందేహాలు ఉన్నాయి.
జనసేనాని తీసుకుంటున్న స్థిరత్వం లేని నిర్ణయాలు అనుసరిస్తున్న పరిణితి చూపని వ్యూహాలు ప్రధాన కారణంగా తెలుస్తుంది.
ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి వచ్చే శక్తి జనసేనానికి లేకపోవచ్చు.కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పవన కళ్యాణ్ కేంద్ర బిందువుగా మారారు.అదేసమయంలో అధికార మరియు ప్రతిపక్ష పార్టీల భవిష్యత్తు పవన కళ్యాణ్ రాజకీయంగా తీసుకునే నిర్ణయం పై ఆధారపడి ఉన్నట్లు రాష్ట్ర రాజకీయాలు తేటతెల్లం చేస్తున్నాయి.అధికార వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీతో జనసేనాని పొత్తు పెట్టుకునే ప్రశక్తి లేదు.కానీ పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే అధికార వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల్లో ఇబ్బందులు ఎదుర్కోవడం తధ్యం అని, అదేవిధంగా జనసేన పార్టీ ఒంటరిగా కానీ లేక బి.జె.పితో కలిసి పోటీచేసినా ముక్కోణపు పోటీలో తిరిగి జగన్ మోహన్ రెడ్డి కి లబ్ది చేకూరే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని ప్రజలలో రకరకాలుగా వార్తలు షికారు చేస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ వలన ఎవరు అధికారంలోకి వస్తారా ? ఎవరు అధికారంలోకి రారు ? అని ప్రజల్లో విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి.కానీ జనసేనాని అధికారంలోకి వస్తారు అని ప్రజలలో చర్చలు జరుగుతున్న దాఖలాలు మచ్చుకైనా లేవు.ఇది ఒకవిధంగా జనసేనాని స్వయంకృతార్ధం గానే భావించవచ్చు.పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్వయంగా స్థాపించిన నాటి నుంచి పరిపూర్ణ రాజకీయ నేతగా పరిణితి ప్రదర్శించి ఉంటే 2024 లో జరగబోయే ఎన్నికల్లో కచ్చితంగా అతనే ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ప్రత్యామ్నాయంగా కనిపించేవారు.2014 ఎన్నికల నుంచి నేటివరకు తాను ముఖ్యమంత్రి అయి ప్రజలకు సేవ చేయాలి అనేదానికన్నా జగన్ మోహన్ రెడ్డి ని రాజకీయంగా దెబ్బతీయాలి అనే విధంగానే జనసేనాని రాజకీయాలు చేస్తున్నారు.ఈ పరిణామం చంద్రబాబు నాయుడు కు లబ్ది చేకూరే విధంగా తయారయ్యింది.
దీనితో చంద్రబాబు నాయుడు బినామీగా పవన్ కళ్యాణ్ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది.పవన్ కళ్యాణ్ రాజకీయ ఎదుగుదలకు ఇదే శరాఘాతంగా మారింది అని కచ్చితంగా చెప్పవచ్చు.ఒక్క చాన్స్ అడిగే ముందు జనసేనాని ప్రజలకు అనేక విషయాలలో స్పష్టత ఇవ్వవలసి ఉంది.2024 ఎన్నికల్లో జనసేనాని ఒంటరిగా పోటీ చేస్తారా ? లేక ఇతర పార్టీలతో కలిసి పోటీ చేస్తారా ? ఇతర పార్టీలతో కలిసి పోటీచేస్తే ఏ పార్టీతో కలసి పోటీ చేస్తారు ? ఆ పార్టీ జనసేనాని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఒప్పుకుంటారా ? బి జె.పి తో కలసి పోటీ చేస్తే ఆంధ్రప్రదేశ్ లో ఆ పార్టీ పరిస్థితి దృష్ట్యా పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఒప్పుకునే అవకాశం ఉంటుంది.గత నాలుగు దశాబ్దాలుగా గ్రామ గ్రామానా విస్తరించి భారత దేశంలోనే అత్యధిక కార్యకర్తల బలం కలిగిన ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ.

అదేవిధంగా భారతదేశంలో సుప్రసిద్ధ నేతగా పేరుగాంచి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి గా మరియు 13 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా, మంత్రి గా వెరసి నాలుగు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ రాజకీయ, పాలనా అనుభవం కలిగిన నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు.ఆవిధమైన చారిత్రాత్మక నేపద్యం ఉన్న తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ కు ఏ ప్రాతిపదికన కొద్ది కాలమైనా ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు బప్పుకుంటుంది ? తనకు ముఖ్యమంత్రి పదవి రాకున్నా పర్వాలేదు జగన్ మోహన్ రెడ్డి ని తిరిగి అధికారంలోకి రానీయకుండా తెలుగుదేశం పార్టీతో చేతులు కలపాలి అని పవన్ కళ్యాణ్ భావించవచ్చు.దానికి పవన్ కళ్యాణ్ ను ఆరాధ్యదైవం గా భావిస్తూ ముఖ్యమంత్రి గా చూడాలని భావిస్తున్న అభిమానులు మరియు పవన్ ను బలపరచే స్వీయ సామాజిక వర్గం ఒప్పు కుంటుందా ? 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు పాలనపై పవన్ కళ్యాణ్ ఘోరంగా విమర్శనాస్త్రాలు సంధించారు.ఒక వేళ చంద్రబాబు తో పొత్తు పెట్టుకుంటే ఇంతలోనే చంద్రబాబు నాయుడు ఎలా సచ్చీలుడు అయ్యారో ప్రజలకు చెప్ప వలసిన బాధ్యత కూడా జనసేనాని పై ఉంటుంది.
ప్రజలలో ఉన్న ఇటువంటి అనేక సందేహాలపై స్పష్టత ఇచ్చిన తరువాత ఒక్క చాన్స్ అడిగినప్పుడే పవన్ కళ్యాణ్ రాజకీయ పరిపక్వత ప్రజలకు తెలుస్తుంది.అదేసమయంలో ప్రజలను ఒక్క చాన్స్ అడగాలంటే కచ్చితంగా రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాలలో పార్టీని గ్రామ స్థాయి వరకు విస్తరింప చేయవలసిన ఆవశ్యకత ప్రతి రాజకీయ పార్టీపై ఉంటుంది అనే విషయం జనసేనాని గ్రహించాలి.
అదేవిధంగా భారతీయ జనతా పార్టీ లాంటి బలమైన జాతీయ పార్టీ నామ మాత్ర బలం కలిగిన జనసేన లాంటి ప్రాంతీయ పార్టీలకు రోడ్ మ్యాప్ ఇచ్చి ప్రోత్సహస్తుందనుకోవడం కచ్చితంగా భ్రమే.కనుక ఇటువంటి విషయాలను గ్రహించి,ప్రజలకు సేవ చేయాలని తలంపు తగ్గట్టు ప్రణాళికా బద్దంగా ప్రజామోదం పొందే రాజకీయాలు చేసినప్పుడే ఈ రాష్ట్రానికి తద్వారా జనసేనానికి మేలుజరిగే అవకాశం ఉంటుంది.